బెంగాల్‌ మేలు కోసం ప్రధాని కాళ్లు పట్టుకుంటా: మమత బెనర్జీ

If The PM Tells Me To Touch His Feet, I am Willing To Do Said By Mamata - Sakshi

బీజేపీలా చిల్లర రాజకీయాలు చేయను

పీఎం-సీఎంల సమావేశంపై అర్థ సత్యాలు ప్రచారం చేశారు

అవమానించడమే లక్ష్యంగా ఆ సమావేశం జరిపారు

కోల్‌కత: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్‌ సీఎం మమత బెనర్జీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బెంగాల్‌లో ఎన్నికలు ముగిసినా ఇంకా రాజకీయ వేడి తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. యాస్‌ తుపానుపై జరిగిన పీఎం, సీఎంల సమావేశం వీరి మధ్య పోరుకు మరోసారి వేదికైంది. 

కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం
బెంగాల్‌కి మేలు చేస్తానంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకునేందుకు తాను సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం మమత బెనర్జీ. చిల్లర రాజకీయాలు చేస్తూ బెంగాల్‌ ప్రజలను అవమానపరచొద్దంటూ బీజేపీకి, ప్రధాని మోదీలకు తేల్చి చెప్పారామే. బెంగాల్‌ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న చీఫ్‌ సెక్రటరీ బదిలీని రద్దు చేయాలని కేంద్రాన్ని మమత బెనర్జీ డిమాండ్‌ చేశారు.

మేము వేచి చూశాం
యాస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే షెడ్యూల్‌​ ఖరారు చేసుకున్నట్టు మమత తెలిపారు. ఇంతలో ప్రధాని పర్యటన ఉందని తెలియడంతో...  ఆయన హెలికాప్టర్‌ దిగే స్థలానికి చేరుకుని ఎదురు చూశామ‍ని... ఆ తర్వాత ఆయన్ని కలిసేందుకు వెళితే మీటింగ్‌లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పడంతో అక్కడ మరో 20 నిమిషాల పాటు ఎదురు చూశామన్నారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్‌హాల్‌లో ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. అయితే అక్కడ ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని మమత తెలిపారు. దీంతో వెంటనే ప్రధానికి తమ రిపోర్టును సమర్పించి... ఆయన అనుమతి తోనే అక్కడి నుంచి బయటకు వచ్చామన్నారు. ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వెళ్లినట్టు మమత వివరించారు. 

ఎందుకీ అవమానం
ఇటీవల వచ్చిన తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు గుజరాత్‌, ఒడిషాలలో ప్రధాని మోదీ  పర్యటించారు. ఆ రాష్ట్ర సీఎంలతో సమావేశమయ్యారు, కానీ ఎక్కడా ప్రతిపక్ష నేతలను ఆ సమావేశాలకు ఆహ్వనించలేదని మమత చెప్పారు. కేవలం బెంగాల్‌లోనే ఎందుకు ప్రతిపక్ష పార్టీలను మీటింగ్‌కు పిలిచారని ఆమె అడిగారు.  ఇటీవల బెంగాల్‌లో ఎదురైన ఘోర ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని, అందుకే ఆ ఓటమికి ప్రతీకారంగా బెంగాల్‌ ప్రజలను అవమానించాలని చూస్తున్నారంటూ మమత ఆరోపించారు. ప్రధాని ఎప్పుడు బెంగాల్‌కి వచ్చినా ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారంటూ ఆమె విమర్శించారు.
ఇబ్బంది పెట్టాలనే
ప్రధాని, సీఎంల మీటింగ్‌కు సంబంధించి తనకు అనుకూలంగా ఉన్న వెర్షన్‌నే బీజేపీ ప్రచారంలోకి తెచ్చి, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోందని మమత అన్నారు. అందుకే ఆ మీటింగ్‌ సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తున్నానంటూ మమత చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top