నితీష్‌ సీఎం అయితే మాదే క్రెడిట్‌: శివసేన

If Nitish Kumar Becomes Chief Minister Credit Goes To Us - Sakshi

బీజేపీపై శివసేన సెటైర్లు

తమకు మాటిచ్చి తప్పిందని విమర్శ

తేజశ్వి యాదవ్‌పై ప్రశంసలు

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్‌ నితీష​ కుమార్‌ నేతృత్వలోని పాలక ఏన్డీఏకు గట్టి పోటీ ఇచ్చారని శివసేన ప్రశంసించింది. జేడీయూ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌ మరోసారి సీఎం అయితే ఆ క్రెడిట్‌ తమకే దక్కుతుందని పేర్కొంది. జేడియూకి సీట్లు తక్కువ వచ్చినా ముఖ్యమంత్రి పీఠం నితీష్‌ కుమార్‌దేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన తెలిపింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి హామీయే శివసేనకు ఇచ్చి కాషాయ పార్టీ నిలబెట్టుకోలేదని దీంతో మహారాష్ట్రలో రాజకీయ మహాభారతం జరిగిందని తెలిపింది. ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య సీఎం పదవిపై అవగాహన కుదిరిందని పేర్కొంది. ఎన్నికల తర్వాత శివసేనకు 56 సీట్లు రావడంతో బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడంతో కూటమి విడిపోయిందని గుర్తుచేసింది. 

బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా పనిచేయడంతో తేజశ్వికి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు పోటీలో లేని మహాకూటమి యువ నేత ప్రతిష్టతోనే విజయానికి దగ్గరగా వచ్చిందని తెలిపింది. కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలవకపోవడం మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని విమర్శించింది. ‘జంగిల్‌రాజ్‌ కా యువరాజ్‌’ అంటూ తేజశ్విని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారని.. ముఖ్యమంత్రి నితీష్‌ ఇదే తనకు చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించింది. తేజశ్వి మాత్రం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై  ప్రచారం నిర్వహించారని పేర్కొంది. దేశ రాజకీయాలకు బిహార్‌ ఎన్నికలు కొత్త తేజశ్విని పరిచయం చేశాయని సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. (చదవండి: వారి స్వరం వినిపిస్తా: ఓవైసీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top