హిమాచల్‌పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం | Himachal Pradesh Cloud burst ANd flash floods | Sakshi
Sakshi News home page

హిమాచల్‌పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం

Jul 4 2025 12:12 PM | Updated on Jul 4 2025 12:45 PM

Himachal Pradesh Cloud burst ANd flash floods

సిమ్లా: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షంతో హిమాచల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని బియాస్‌ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికి 63 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

హిల్‌స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

 

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్‌, సిర్మౌర్‌, జూలై 6న ఉనా, బిలాస్‌పూర్‌, హమీర్‌పూర్‌, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement