
సాక్షి,చెన్నై: కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన బారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. మధురైలో గురువారం సాయంత్రం జరుగుతున్న ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరుకాగా.. తొక్కిసలాటతో 400మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కగళం(టీవీకే) గురువారం మధురైలో నాలుగు లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధురై జిల్లాలోని మధురై-తూత్తుకుడి హైవేలో పరపతిలో టీవీకే రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరుగుతోంది. 501 ఎకరాల్లో సచివాలయం ఆకారంలో ఈ సభను ఏర్పాటు చేసింది.
ఈ భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనసంద్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని ఇళయదళపతి హీరో విజయ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ, డీఏంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని పేర్కొంది.