
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఓట్ చోరీ అంశంపై అటు ఈసీనీ, ఇటు కేంద్రాన్ని విమర్శిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటిచినట్లు తెలుస్తోంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్‌లో ఎన్డీఏ నేతలతో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్‌లో యువత టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది యువ కాంగ్రెస్ నాయకుల్లో మంచి టాలెంట్ ఉంది. యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు. కానీ వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. దాన్ని రాహుల్ గాంధీనే కల్పించడం లేదు. రాహుల్ గాంధీ అభద్రతా భావంతో ఉన్నట్లు ఉన్నారు. ఇది ‘‘ కుటుంబ అభద్రతాభావం’’ అయి ఉండొచ్చు’ అని ఎన్డీఏ నేతలతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎక్కువ శాతం నిరసనలతోనే సభ గడిచింది. బీహార్‌లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేశాయి.
నేడు లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు.