దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో? | Uttarakhand Cloudburst August 6th News Updates | Sakshi
Sakshi News home page

దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో?

Aug 6 2025 4:31 PM | Updated on Aug 6 2025 4:44 PM

Uttarakhand Cloudburst August 6th News Updates

దేవభూమిని మరోమారు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం కుంభవృష్టి ధాటికి వరద పోటెత్తి ఏకంగా రెండు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. నివాసాలు, హోటల్స్‌ బురద వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ విలయం ధాటికి ఇప్పటికే ఐదుగురు మరణించగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, అదే సమయంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్‌లో.. మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ఖీర్ గధ్ వాగు నీటిమట్టం ఊహించని రీతిలో ప్రమాదస్థాయికి చేరుకుని ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. స్వల్ప వ్యవధిలో ధరాలీ (Dharali), సుకీ(Sukhi) గ్రామాలను కొండకు చెరోవైపు నుంచి ఆకస్మిక వరద(Flash Floods) ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో.. 

గల్లైంతన వారి కోసం బుధవారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షం సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. అయినప్పటికీ సైన్యం ముందుకు వెళ్తోంది. శరణార్థులకు భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలను అందిస్తోంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం.. విపత్తు సహాయక బృందాలు  సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 

కనీసం 50 మంది గల్లంతై ఉండొచ్చని స్థానికుల సమాచారం ఆధారంగా అధికారులు ప్రకటన చేశారు. అయితే.. కేవలం కేరళ నుంచి 28 మందితో వచ్చిన ఓ బృందం ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ భారీవర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. పర్వత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్‌ ఎంపీలు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సహాయక చర్యలపై విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పుష్పర్‌ ధామి ఉత్తర కాశీలో ఏరియల్‌ సర్వే నిర్వహించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement