
నీట్ స్థానికత కేసులోరాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
పదేళ్ల గడువు ముగిసినందునే జీఓ 33 తెచ్చామన్న ప్రభుత్వం
ఆ జీఓను 2028లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించిన కోర్టు
వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసిన సీజేఐ ధర్మాసనం
వచ్చే శుక్రవారం వరకు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థి కేవలం రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో.. తల్లిదండ్రుల బదిలీ కారణంగానో రెండేళ్లపాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది.
2028లో ఎందుకు అమలు చేయకూడదు?
తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీఓ తెచ్చినట్లు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్‌పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలగజేసుకున్న సీజేఐ జస్టిస్ గవాయ్.. పదేళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 2028లో జీఓ 33ను ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. పదేళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు.
2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే నాలుగేళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు.
దీంతో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు విద్యనభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 (డి) గురించి తెలుసుకోవాలని అన్నట్లుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా’ అని ప్రశ్నించారు.
పదేళ్లు చదివినా
నాన్ లోకల్ అవుతున్నాం
ప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీఓ 33 కారణంగా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్‌లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు నివేదించారు. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.