
బీజేపీ, డీఎంకేలతో పొత్తు ప్రశ్నే లేదు
నటుడు, టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్య
సీఎం స్టాలిన్‌కు పలు ప్రశ్నలు
మదురైలో జరిగిన సభకు భారీగా జనం
సాక్షి, చెన్నై: సింహం ఎప్పటికీ సింహంగానే ఉంటుందని నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, డీఎంకేలతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని, ఆ రెండు పార్టీలు తమకు బద్ధ శత్రువులని విమర్శించారు. ఆత్మగౌరవంతోనే ముందుకు సాగుతామన్నారు. తమిళనాడులోని మదురైలో గురువారం జరిగిన పార్టీ రెండో మహాసభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సభలో ఆయన ప్రసంగించారు. తమ రాజకీయ శత్రువు డీఎంకే కాగా, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని పేర్కొన్నారు. టీవీకే ఎవరికీ భయపడదు, మాఫియా వ్యాపారాలు చేయదు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు బలం మొత్తం మనతోనే ఉంది. ఫాసిస్ట్ బీజేపీ, విషపూరిత డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సింహం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని గర్జన 8 కిలోమీటర్ల మేర ప్రతిధ్వనిస్తుంది. వేటకు మాత్రమే బయటకు వస్తుంది. అడవిలో నక్కలు చాలానే ఉంటాయి. సింహం మాత్రం ఒక్కటే. అదే అడవికి రాజు. ఇదే మా స్పష్టమైన ప్రకటన’అని విజయ్ పేర్కొన్నారు.

మిస్టర్ పీఎం మోదీజీ.. సీఎం స్టాలిన్ అంకుల్!
మిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ జీ అంటూ అని సంబోధించిన విజయ్..తమిళనాడు ప్రజల ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. అరెస్టయిన తమిళ జాలర్లను విడిపించాలి..కచ్ఛతీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలి, నీట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్లు వినిపించారు. బీజేపీది బానిసల కూటమి అని విమర్శలు ఎక్కుబెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు బీజేపీ బానిస అని, బీజేపీకి అనేక రాష్ట్ర పార్టీలు బానిసలుగా మారి మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఆ బానిసలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టీవీకే ఉండబోదని స్పష్టం చేశారు. అదేవిధంగా, మైడియర్ అంకుల్ అంటూ సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి విమర్శలను ఎక్కుపెట్టారు. మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇస్తే సరిపోతుందా? వాళ్ల రోదనలు వినిపించడం లేదా? పరంధుర్ ఎయిర్‌పోర్టుతో భూములు కోల్పోయిన రైతులు, మత్స్యకారుల ఆవేదన ఆలకించారా? మనస్సాక్షి ఉంటే సమాధానం ఇవ్వండని సవాల్ విసిరారు. మైడియర్ అంకుల్ వినిపిస్తుందా ప్రజా గళం? త్వరలో ప్రజల్లోకి వెళ్తున్నా. మనస్సు విప్పి మాట్లాడుతా..ఇక తమరికి నిద్ర కరువైనట్టే అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలలో తానే అభ్యర్థి అని, తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
