ఉదయనిధికి బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం 49వ వసంతంలోకి అడుగు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే, యువజన విభాగాల నేతృత్వంలో వాడ వాడలలో మనిద నేయ ఉదయ నాల్ పేరిట జన్మదిన వేడుకలను నిర్వహించారు. పేదలకు సంక్షేమ,సహాయకాలను పంపిణీ చేశారు. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు గత బర్త్‌డే కు ముందుగా డిప్యూటీ సీఎం పదవి దక్కిన విషయం తెలిసిందే. క్రీడలశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఈ ఏడాది కాలంలో రాజకీయంగా ఆయన దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే విధంగా విస్తృత పర్యటనలు చేస్తూ వస్తున్నారు. అధికారిక, ప్రభుత్వ కార్యాక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఈ పరిస్థితులలో గురువారం ఆయన 49వ వసంతంలోకి అడుగు పెట్టడంతో వేడుకలను మనిద నేయ ఉదయనాల్ పేరిట కోలాహలంగా డీఎంకే వర్గాలు జరుపుకున్నాయి. ఆయన బర్త్‌డేను డీఎంకే యువజన విభాగం వాడ వాడలలో సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయనిధి అందుకున్నారు. కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మెరీనా తీరంలోని దివంగత సీఎం అన్నాదురై, దివంగత నేత, తాతయ్య కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. మంత్రి శేఖర్‌బాబుతో కలిసి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఇంటికి కావాల్సిన వస్తువులు, ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మంత్రులు అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, టీఆర్‌బీ రాజ, సీవీ గణేషన్, శేఖర్‌బాబులతో కలిసి వేప్పేరిలోని పెరియార్ తిడల్‌లో ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ స్మారకం వద్ద అంజలి ఘటించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పేదలకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఈసందర్భంగా ఉదయ నిధి ప్రసంగిస్తూ అధ్యక్షుడు స్టాలిన్ పిలుపు మేరకు రానున్న ఎన్నికలలో 200 స్థానాల కై వశంతో చరిత్ర సృష్టిద్దామని పిలుపు నిచ్చారు. అనంతరం గోపాలపురం, సీఐటీ నగర్‌లలోని ఇంటికి వెళ్లారు. తన మేనత్త, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపి కనిమొళిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
సంబరాలు..
డీఎంకే యూత్ నేతృత్వంలో ఓవైపు, డీఎంకే పార్టీ నేతృత్వంలో మరో వైపు వాడవాడలా సేవా కార్యక్రమాలు హోరెత్తించారు. అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సభల రూపంలో వేడుకలు నిర్వహించారు. ఉదయ నిధికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన నివాసం వద్దకు ఓ వైపు, డీఎంకే ప్రధాన కార్యాలయంకు మరో వైపు అభిమానులు, యువజనులు పోటెత్తారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కేడర్ కానుకలను అందజేశారు. ఇక డీఎంకే కూటమి పార్టీల నేతలు ఉదయ నిధికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, యువజన నేతగా, మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి పనితీరును అందరూ అభినందిస్తుంటే, ఓతండ్రిగానే కాకుండా, పార్టీ అధ్యక్షుడిగా తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.
ఉదయనిధికి బ్రహ్మరథం


