సేవా అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె : సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ నేతృత్వంలో 2025 సంవత్సరానికి గాను శిశు సంక్షేమం– సేవా అవార్డులను సీఎం స్టాలిన్ గురువారం ప్రదానం చేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తంజావూరు– మదర్ సత్య అమ్మయార్ మెమోరియల్ హాల్, తూత్తుకుడి – హోలీ మరియన్ మెర్సీ హోమ్, చైన్నె – ప్రభుత్వ దూర దృష్టి గృహం, రామనాధపురం –బాలల రక్షణ యూనిట్‌కు ఈ అవార్డులను అందజేశారు. ఒకొక్కరికి రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గీతా జీవన్, సీఎస్ మురుగానందం, మహిళా హక్కుల శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హిందూ దేవాదాయ శాఖ నేతృత్వంలో రూ. 79.94 కోట్లతో పూర్తి చేసిన 20 ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, 25 కొత్త ప్రాజెక్టులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. 18 ఆలయాలలో కొత్తగా పనులు చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఒక కకళాశాలలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంకు శంకు స్థాపన చేశారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం గిరివలం మార్గంలో భక్తులకు కోట్లాది రూపాయల విలువైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించే విధంగా ఆరోగ్య కేంద్రాలు, విశ్రాంతి మందిరాలపై దృష్టి పెట్టారు. తిరుచ్చి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి చెందిన రామానుజ జియ్యర్ మఠంల పునరుద్ధరణ తదితర పనులు ఇందులోఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పీకే శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే రూ. 10.79 కోట్లతో మైనారిటీ సంక్షేమ శాఖ నేతృత్వంలో నిర్మించిన భవనాలను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే,రూ. 38.85 కోట్లతో తొమ్మిది పురాతన మసీదులు, దర్గాల మరమ్మతు పనులకు శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు నాజర్, శివ వి. మెయ్యనాథన్, తదితరులు పాల్గొన్నారు. చివరగా కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్ డివిజన్, తిరుముట్టం డివిజన్లలోని 38 రెవెన్యూ గ్రామాలలోని వ్యవసాయ భూముల పరిరక్షణ దిశగా ప్రత్యేక ఉత్తర్వులను సీఎం జారీ చేశారు.
సేవా అవార్డుల ప్రదానం


