క్లుప్తంగా
నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా
కొరుక్కుపేట: చైన్నెలోని కోయంబేడులోని జే పార్క్ సమీపంలో పార్క్ చేసిన ప్రైవేట్ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో రోడ్డుపై ఆక్రమించి పార్క్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. కోయంబేడు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్.పి. సుందరం ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు.
గంజాయి తరలింపు కేసులో మహిళ అరెస్ట్
తిరువొత్తియూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చైన్నెకి గంజాయి తరలిచిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నె వెస్ట్ జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్ ఆదేశాల మేరకు, అన్నానగర్ ఎక్స్ఛేంజ్ అసిస్టెంట్ కమిషనర్ బాలసుబ్రమణియన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కోయంబేడు మార్కెట్, బస్ స్టేషన్ ప్రాంతాలలో తీవ్రంగా నిఘా పెట్టారు. ఆ సమయంలో కోయంబేడు మార్కెట్ సమీపంలోని రోడ్డులో ఆంధ్ర రాష్ట్ర బస్సు నుంచి ఓ మహిళ పెద్ద పార్సిల్‌తో దిగి, ఆటో డ్రైవర్‌ను కోయంబేడు బస్ స్టేషన్‌కు వెళ్లాలని పిలిచింది. తరువాత ఆ పార్శిల్‌ను ఆటోలో ఎక్కిస్తున్నప్పుడు, పోలీసులు వెళ్లి ఆ మహిళను పట్టుకుని పార్సిల్‌ను తనిఖీ చేయగా, అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మహిళను అరెస్టు చేసి విచారించగా, ఆమె తంజావూరు జిల్లాకు చెందిన ప్రముఖ గంజాయి వ్యాపారి ధనలక్ష్మి (55) అని, ఆమైపె ఇప్పటికే 5 గంజాయి కేసులు ఉన్నాయని తెలిసింది. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆమెను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
కామాంధుడికి జైలుశిక్ష
తిరువళ్లూరు: కన్నకూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు ఫోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా కొత్త చాకలిపేట జీవానగర్‌కు చెందిన సురేష్‌కుమార్ చైన్నె పెరంబూరులోని ఐసీఎఫ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య సంధ్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్‌కుమార్‌కు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై భార్యభర్త మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో భార్య సంధ్య నుంచి విడాకులు కోరాడు. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన సురేష్‌కుమార్ తన 13 ఏళ్ల కుమార్తేపై లైంగిక దాడికి దిగినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనపై సంధ్య ఇచ్చిన పిర్యాదు మేరకు తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ తిరువళ్లూరు ఫోక్సో కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో నిందితుడు సురేష్‌కుమార్‌కు 17 ఏళ్ల జైలు శిక్షతోపాటు 25 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. దీంతోపాటు బాలికకూ మూడు లక్షల రూపాయల పరిహారాన్ని సైతం అందజేయడానికి సిఫారసు చేశారు. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు.
ఎలుకల మందు తిని ఆత్మహత్య
అన్నానగర్: కూడలూరు సమీపంలో ఎలుకల మందు తిని ప్లస్–1 విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. తేని జిల్లా కూడలూర్ సమీపంలోని ధమ్మనాంపట్టికి చెందిన కారు డ్రైవర్ మురుగన్ భార్య సంగీత. వీరి కుమార్తె యువిక(17). ఈమె కూడలూరులోని ఒక పాఠశాలలో ప్లస్–1 చదువుతోంది. ఇంతలో యువిక పుట్టినరోజు 21న వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు కొత్త దుస్తులు కొనలేదని, కేక్ కట్ చేసి జరుపుకోలేదని తెలుస్తోంది. దీంతో యువిక తన తల్లిదండ్రులతో వాగ్వాదం చేసింది. మరుసటి రోజు ఉదయం యువిక అకస్మాత్తుగా వాంతులు చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా, ఆమె పుట్టినరోజుకు మీరు ఏమీ చేయనందున కోపంతో ఎలుకల మందు తిన్నానని చెప్పింది. ఇది విన్న ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతితో వెంటనే ఆమెను కంబం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత, ఆమెను తదుపరి చికిత్స కోసం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స ఫలించక యువిక గురువారం మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల బంధువుల వద్ద సీబీఐ విచారణ
సాక్షి, చైన్నె: కరూర్ ఘటనలో మరణించిన వారి బంధువుల వద్ద సీబీఐ అధికారులు గురువారం విచారణ నిర్వహించారు. టీవీకే నేత విజయ్ ప్రచారం సందర్భంగా కరూర్‌లో జరిగిన విషాదంలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసును పలు కోణాలలో సీబీఐ విచారిస్తున్నది. గత రెండు రోజులుగా టీవీకే అగ్ర నేతల వద్ద విచారణ జరిగింది. తాజాగా మృతుల బంధువులను విచారించేందుకు సీబీఐ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగారోజుకు 10 మంది మృతుల కుటుంబాలకు విచారణకు పిలిపించే పనిలోపడ్డారు. గురువారం పది కుటుంబాలు హాజరై తమ వద్ద ఉన్న సమాచారాలను సీబీఐకు తెలియజేశారు.


