మరో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, చైన్నె : తనను ప్రేమించి మరొకరితో నిశ్చితార్థానికి సిద్ధ పడ్డ ప్రియురాలిపై ప్రేమోన్మాది ఆక్రోశాన్ని ప్రదర్శించాడు. నడి రోడ్డులో అందరు చూస్తుండగానే టీచర్‌గా ఉన్న ప్రియురాలిపై కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాలు.. తంజావూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయం మేల కలక్కుడికి చెందిన పుణ్యమూర్తి కుమార్తె కావ్య(26) ఆలంకుడిలోని ప్రాథమిక పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన పెయింటర్ అజిత్ కుమార్ (26)తో కొన్ని సంత్సరాల క్రితం కావ్యకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ పరిస్థితులలో కావ్య తన బంధువు ఒకరిని తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహం చేసుకోవాల్సిన అవశ్యం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివాహ నిశ్చయతార్తం కూడా జరిగింది. తనకు జరిగిన నిశ్చయతార్థంకు సంబంధించిన ఫొటోలను అజిత్‌కుమార్‌కు ఆమె పంపించింది. దీంతో కోపోద్రిక్తుడైన అజిత్‌కుమార్ ప్రేమోన్మాదిగా మారాడు. తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి సిద్ధ పడుతావా..? అన్న ఆగ్రహంతో ఊగి పోయాడు. ఉన్మాదిగా మారిన అజిత్‌కుమార్ గురువారం ఉదయం కావ్య పాఠశాలకు వెళ్తుండగా వెళ్లి కలిశారు. తననే ప్రేమించాలి, తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించి, పాఠశాలకు వెళ్తుండగా కోపోద్రిక్తుడైన అతడు తన వద్ద ఉన్న కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతంగా పొడిచి చంపేశారు. అతడ్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. అప్పటికే అతడు విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పాపనాశం పోలీసులు రంగంలోకి దిగారు. కావ్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అజిత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. కాగా గత వారం రామేశ్వరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి షాలిని బలైన ఘటన మరువక ముందే మరో ఘటన తాజాగా జరగడం గమనార్హం.
మరో ప్రేమోన్మాది ఘాతుకం


