వైభవంగా పంచమీ తీర్థం
కొరుక్కుపేట: చైన్నె పెరంబూర్‌లోని శ్రీవేంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో పంచమి తీర్థం కనుల పండువగా సాగింది. శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీవేంకటేశ్వర భక్త సమాజం ఆనంద నిలయంలో పంచమీతీర్థ వైభవాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా పెరుమాళ్, శ్రీ దేవి, భూదేవి అమ్మవార్లను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పైగా పెరంబూరులోని పెరుమాళ్ రామచంద్రన్‌రోడ్డులో ఉన్న శ్రీ గురువాయూరప్ప దేవాలయం నుంచి మహిళలు, భక్తులు పసుపు, పండ్లు, లడ్డూ, మైసూర్ పాక్, అతిరసం, యాపిల్, దానిమ్మ, అరటిపండు, వివిధ రకాల పుష్పాలు, ప్రత్యేక వస్త్రాలు, శ్రీవేంకటేశ్వర స్వామి, అమ్మవారికి అలంకారాలు, పూలమాలలతో కూడిన సారెను ఊరేగింపుగా ఆనంద నిలయానికి తీసుకునివచ్చారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారికి అర్చన, ఆరాధన, నామ సంకీర్తనలు నిర్వహించి పంచమీతీర్థ వైభవంను విజయవంతంగా చేపట్టారు. వేడుకలో పాల్గొన్న భక్తులకు హారతి, ప్రత్యేక అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమాజం సెక్రటరీ ఎస్.వెంకట రామన్, జాయింట్ సెక్రటరీ పి.రవికుమార్, కోశాధికారి కోదండరామయ్య, జాయింట్ ట్రెజరర్ హెచ్‌డీ వెంకటరమణుడు, ట్రస్టీ రామచంద్రన్, సభ్యులు ఎస్.శరవణన్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


