
కన్నూర్: ఆధునిక టెక్నాలజీ అందించిన పరికరాలను సక్రమ రీతిలో వినియోగించాల్సిన కొందరు వాటిని అక్రమ పద్ధతులకు ఉపయోగిస్తూ, లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేరళలోని కన్నూర్‌లో జరిగిన పీఎస్‌సీ సెక్రటేరియట్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలో ఒక యువకుడు హైటెక్ మోసానికి పాల్పడి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
కన్నూర్‌లోని ముండలూర్‌లోని పెరలస్సేరీలోని సురూర్ నివాస్‌కు చెందిన ఎంపీ ముహమ్మద్ సహద్ (25) పరీక్షలో చీటింగ్‌కు పాల్పడుతూ ఇన్విజిలేటర్ల కంటపడ్డాడు. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగునందుకున్నాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పయ్యంబలం ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో జరిగింది. ముహమ్మద్ సహద్ తన షర్టు కాలర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. బయటకు కనిపించని విధంగా ఇయర్‌ఫోన్స్ కూడా అమర్చుకున్నాడు.
ప్రశ్నాపత్రాన్ని కెమెరా ద్వారా బయటి వ్యక్తులకు చూపించి, ఇయర్ ఫోన్ ద్వారా సమాధానాలు వింటూ, పరీక్ష రాసే ప్రయత్నం చేశాడు. అయితే పరీక్షా హాలులోని అధికారులు అతనిని తనిఖీ చేసి,కెమెరా, పెన్ డ్రైవ్,హెడ్‌సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తాను గతంలో కూడా ఇదే విధంగా పరీక్షలలో మోసం చేసినట్లు అంగీకరించాడు. సహద్ గత నెలలో జరిగిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలోనూ ఇదే విధంగా కాపీ కొట్టాడు. నిందితుడు ఇప్పటివరకు రాసిన పరీక్షల సమాధాన పత్రాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.