
గుర్గావ్: హర్యానా రాజధాని చండీగఢ్‌లో విషాదం జరిగింది. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) సెక్టార్ 11లో ఉన్న తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న చండీగఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పురాణ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్‌తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్‌కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్‌లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీతో పాటు జపాన్ పర్యటనకు వెళ్లారు. భర్త మరణించిన విషయం తెలుసుకున్న ఆమె వెంటనే భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని దర్యాప్తు ప్రారంభించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని తెలిపారు.