బీజేపీ అండతో రెచ్చిపోతున్నారు.. శివసైనికులు చూస్తూ ఊరుకోవద్దు: రౌత్‌ పిలుపు

Hanuman Chalisa Controversy: Shiv Sena MP Sanjay Raut Warn - Sakshi

ముంబై: మహానగరంలో ‘హనుమాన్‌ చాలీసా’ ఛాలెంజ్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీకి ఎలాగైనా చేరుకుని హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నగర వ్యాప్తంగా హై అలర్ట్‌ విధించారు. 

చాలెంజ్‌ ప్రకారం.. ఎలాగైనా మాతోశ్రీని తన అనుచరులతో చేరుకోవాలని ఎంపీ నవనీత్‌కౌర్‌, ఆమె భర్త రవి రానాలు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నవనీత్‌ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టనివ్వకుండా శివ సేన కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త, సీఎం ఉద్దవ్‌ థాక్రేపై విమర్శలు గుప్పించారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు.

ఇక ఈ పరిణామాలపై సేన నేత,  ఉద్దవ్‌ థాక్రే ముఖ్యఅనుచరుడు సంజయ్‌ రౌత్‌ స్పందించాడు. ఎవరైనా మాతోశ్రీని చేరుకునే ప్రయత్నాలు చేసినా చూస్తూ ఊరుకోవద్దంటూ శివ సైనికులకు సూచించాడు. ‘‘అలా చేస్తూ చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దమ్ముంటే రండి. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ భాషకు మీ భాషలోనే సమాధానం ఎలా ఇవ్వాలో శివ సైనికులకు బాగా తెలుసు. బీజేపీ అండతో ఆమె(నవనీత్‌కౌర్‌ను ఉద్దేశించి) రెచ్చిపోతున్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉంది’’ అంటూ స్పందించాడు ఎంపీ సంజయ్‌ రౌత్‌. అంతేకాదు రాష్ట్రపతి పాలన ప్రస్తావనపై స్పందిస్తూ.. కేంద్రం చర్యలకు బెదిరే ప్రసక్తే లేదంటూ బదులిచ్చాడు.

ఆజాన్‌, లౌడ్‌స్పీకర్‌ వివాదాలు నడుస్తున్న వేళ.. ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు, సీఎం ఉద్దవ్‌ థాక్రేను హనుమాన్‌ జయంతి నాడు హనుమాన్‌ చాలీసా పఠించాలంటూ సవాల్‌ విసిరారు. లేకుంటే.. తాము మాతోశ్రీ ఎదుటకు వచ్చి హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ పేర్కొన్నారు. 

ఈ తరుణంలో అప్రమత్తమైన శివ సేన కార్యకర్తలు ఎంపీ నవనీత్‌ కౌర్‌ నివాసం ఎదుట నిరసనలు శనివారం మోహరించారు. దీంతో ఆమె, సీఎం ఉద్దవ్‌ థాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే వాళ్ల దాడి నుంచి మాతోశ్రీని రక్షించుకునే ప్రయత్నమే తమదని సేన కార్యకర్తలు చెబుతున్నారు. 

ఓ పక్క ముంబై పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పొలిటికల్‌ జంటకు శుక్రవారం నోటీసులు జారీ చేయగా.. మరోవైపు కేంద్రం అమరావతి లోక్‌సభ సభ్యురాలైన నవనీత్‌ కౌర్‌కు కేంద్ర సాయుధ కమాండోలతో వీఐపీ భద్రత కలిపించడం విశేషం.

చదవండి👉🏼: మేం తగ్గం.. ఆ పని చేసి తీరతాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top