సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారు
మా ఖాతాలను హ్యాకింగ్ చేస్తున్నారు
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలు తమకు అందుబాటులో లేవని వెల్లడి
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారని, హ్యాకింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీకి ప్రస్తుతం తమ సోషల్ మీడియా ఖాతాలేవీ అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని విమర్శించారు. రెండు రోజుల క్రితం సీజేపీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పార్టీ కొత్త ఖాతాను సృష్టించుకుంది. నీట్(యూజీ)–2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ సీజేపీ శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉద్యమం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉందని అభిజిత్ దిప్కే చెప్పారు. తమ పార్టీని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీని, తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ పేజీని హ్యాక్ చేశారని తెలిపారు. ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారని, బ్యాకప్ ఖాతాను కూడా తొలగించారని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలేవీ తమకు అందుబాటులో లేవన్నారు. ఇకపై వచ్చే పోస్టులను కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనగా పరిగణించకూడదని కోరారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు కక్షగట్టారు
సీజేపీ వెబ్‌సైట్ అయిన ‘కాక్రోచ్‌జనతాపార్టీ.ఓఆర్‌జీ’ని కూడా ప్రభుత్వ వర్గాలు కక్షపూరితంగా తొలగించినట్లు అభిజిత్ దీప్కే తెలిపారు. అది ఇప్పుడు అందుబాటులో లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తమ పార్టీపై యుద్ధం ప్రకటించారని అభిజిత్ దీప్కే మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం మా ప్రతిష్టాత్మక వెబ్‌సైట్‌ను తొలగించింది. మా వెబ్‌సైట్‌లో కోటి మంది సభ్యులుగా చేరారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు లక్షల మంది సభ్యులు పిటిషన్‌పై సంతకం చేశారు’’అని వివరించారు. ఎంతగా అణచివేస్తున్నా తమ ఉద్యమం నానాటికీ విస్తరిస్తూనే ఉందని తేల్చిచెప్పారు. ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను నిలిపివేయడాన్ని డిజిటల్ హక్కుల సంఘం ‘ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’తప్పుపట్టింది. ఈ చర్యను ప్రభుత్వ అధికార దురి్వనియోగంగా అభివర్ణించింది.
ఇదీ కాక్రోచ్ కథ
→ ఉద్యోగాలు, ఉపాధి లేని యువత పరాన్నజీవులుగా, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ విమర్శించారు.
→ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో సంబంధాలున్న అభిజిత్ దీప్కే అనే యువకుడు జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఈ నెల 16న ‘వాయిస్ ఆఫ్‌లేజీ అండ్ అన్‌ఎంప్లాయ్‌డ్’అనే ట్యాగ్‌లైన్‌తో కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. ఇదొక ఆన్‌లైన్ వ్యంగ్య పార్టీ. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని, ఐదు సూత్రాల మేనిఫెస్టోను ప్రకటించాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో పోరాటం సాగించడమే తన లక్ష్యమని స్పష్టంచేశాడు. ప్రధానంగా యువత ఈ పార్టీ పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు.
→ కాక్రోచ్ జనతా పార్టీని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించేవారి సంఖ్య కోటికి చేరుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే 40 వేల మంది ఆ పార్టీలో చేరారు.
→ నిరుద్యోగం, రాజకీయ జవాబుదారీతనం, ప్రశ్నపత్రాల లీకేజీలపై యువతలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని సీజేపీ బహిర్గతం చేసింది. సీజేపీ వెబ్‌సైట్. ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
→ అధికార బీజేపీ సహా ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల కంటే సీజేపీకి సోషల్ మీడియాలో అధికంగా ఆదరణ లభించింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ కంటే సీజేపీని ఎక్కువ మంది అనుసరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సీజేపీని అనుసరించేవారి సంఖ్య 2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 22న సీజేపీ ‘ఎక్స్’ఖాతాను నిలిపివేసింది.


