
21 నుంచి పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండు రోజులు ముందుగా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజులపాటు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో వెల్లడించారు.
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 13, 14వ తేదీల్లో సమావేశాలు ఉండవని చెప్పారు. పార్లమెంటు సమావేశాలను ఆగస్ట్ 12వ తేదీతోనే ముగించాలని ముందుగా నిర్ణయించారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వాటిని అమలు చేయడానికే సమావేశాల వ్యవధిని మరో తొమ్మిది రోజులు పొడిగించినట్లు సమాచారం. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సంక్షేమానికి సంబంధించిన బిల్లులతో సహా పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.