
రాంచీ: జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్సువాన్ జిల్లాలోని చండిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలుకు చెందిన 20 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఫలితంగా ఆగ్నేయ రైల్వేలోని చండిల్-టాటానగర్ విభాగంలో రైలు సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
చండిల్ మీదుగా నడిచే రైలు సర్వీసులు నిలిపివేశామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (ఆద్రా డివిజన్) వికాష్ కుమార్ తెలిపారు. రైలు ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రస్తుతం క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. పట్టాలు తప్పిన వ్యాగన్‌లను తొలగించేందుకు, దెబ్బతిన్న ట్రాక్‌లను మరమ్మతు చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. గూడ్సు రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ మార్గంలోని పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. రద్దు చేసిన సర్వీసులలో 20894 పట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, 28181 టాటానగర్-కతిహార్ ఎక్స్‌ప్రెస్, 28182 కతిహార్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.