సోనాలి ఫోగట్‌ కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తునకు ఓకే

Goa CM Pramod Sawant recommends Sonali Phogat death Case To CBI - Sakshi

పనాజి: సంచలనం సృష్టించిన హర్యానా నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రకటించారు. 

‘‘మా పోలీసుల(గోవా పోలీసులు) మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, సోనాలి ఫోగట్‌ కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’’ అని గోవా సీఎం సావంత్‌ ప్రకటించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి లేఖ రాసినట్లు సావంత్‌ వెల్లడించారు.  అంతకు ముందు.. హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా గోవా పోలీసుల దర్యాప్తుపై సోనాలీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకుంటే సీబీఐ విచారణకే అప్పగిస్తామంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజే గోవా ప్రభుత్వం సీబీఐకు కేసును అప్పగించడం గమనార్హం. 

గోవా టూర్‌కు వెళ్లిన ఆమె.. గత నెలలో ఆమె హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది హత్యనే విషయం నిర్ధారణ అయ్యింది. వ్యక్తిగత సిబ్బంది సుధీర్‌ సాంగ్వాన్‌, సుధీర్‌ అనుచరుడు సుఖ్విందర్‌లు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. సోనాలి ఫోగట్‌ హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ వస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడి బ్లాక్‌ మెయిల్‌ చేశారంటూ కుటుంబ సభ్యులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
 

ఇదీ చదవండి: తల నరికేసే ఊరిలో.. సరిహద్దు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top