Kolkata: లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు!

Gita Path by One Lakh People in Kolkata - Sakshi

కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్‌లో ఈరోజు(ఆదివారం, డిసెంబరు 24) లక్ష మంది సామూహిక గీతా పఠనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సంస్కృత పరిషత్, మతిలాల్ భారత్ తీర్థ సేవా మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం.

ఈ కార్యక్రమం నిర్వహించడంపై ప్రధాని ప్రత్యేక సందేశం ద్వారా ప్రశంసించారు. కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ‘లోఖో కాంఠే గీతార్ పాఠ్‌’ కార్యక్రమం అభినందనీయమని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మన సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలు, జ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మేధస్సు, సాంస్కృతిక వైవిధ్యం, సామరస్య సమ్మేళనాల మేళవింపు ఈ కార్యక్రమం అని ప్రధాని మోదీ కొనియాడారు. 

శ్రీమద్ భగవత్ గీత మహాభారత కాలం మొదలుకొని నేటి కాలం వరకూ మనందరికీ స్ఫూర్తినిస్తోంది. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి గీత మనకు దిశానిర్దేశం చేస్తుందని, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడాన్ని నేర్పుతుందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా కోల్‌కతాలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 300 మందికి పైగా సాధువులు కోల్‌కతా చేరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారంతా ముందుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు 20 బ్లాకులను రూపొందించినట్లు  నిర్వాహకుల్లో ఒకరైన స్వామి నిర్గుణానంద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top