జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో! | G20 Summit: IMD Issued Specialised Weather Forecast, Check Details - Sakshi
Sakshi News home page

G20 Summit 2023: స్ట్రీట్‌ ఫుడ్, మిల్లెట్స్‌తో ప్రత్యేక మెనూ

Published Sat, Sep 9 2023 8:07 AM

G20 Summit Delhi: IMD Provide Specialised Weather Forecast Other Details Here - Sakshi

జై సియా రాం
భారత మూలాలున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు శుక్రవారం ఉదయం పాలం విమానాశ్రయంలో.. కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే  జై సియా రాం(జై  శ్రీరాం) అంటూ స్వాగతం పలికారు. వారికి  మంత్రి చౌబే రుద్రాక్షను, భగవద్గీత, హనుమాన్‌ చాలీసా ప్రతులను కానుకలుగా అందజేశారు.

వ్యాపారవేత్తలకు ఆహ్వానాల్లేవ్‌..
జీ20 ప్రత్యేక విందు కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు వెళ్లాయన్న వార్తలపై కేంద్రం స్పందించింది. జీ20 స్పెషల్‌ డిన్నర్‌కు రావాలంటూ వ్యాపారవేత్తలను ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. శనివారం జరిగే విందుకు బిలియనీర్లు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ వంటి 500 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరవనున్నారంటూ వస్తున్న వార్తలను తప్పుదోవపట్టించేవిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్యవేత్తలెవరినీ ఆహ్వానించలేదని తెలిపింది.

యూపీఐని పరిచయం చేసేందుకు..
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమంపై జీ20 ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ ప్రతినిధులు ఢిల్లీలో ఉండగా జరిపే కొనుగోళ్లకు గాను యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా చెల్లింపులపై ఆసక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంది. దేశీయంగా రూపకల్పన చేసిన ఈ విధానంలో చెల్లింపులు ఎంత సులువో వారికి తెలియజేయడమే ఉద్దేశం. ఇందులోభాగంగా సుమారు వెయ్యి మంది విదేశీ ప్రతినిధుల ఫోన్‌ వ్యాలెట్లలో రూ.500 నుంచి రూ.1000 వరకు బ్యాలెన్స్‌ జమ చేయనుంది. ఇందుకోసం రూ.10 లక్షల వరకు ప్రత్యేకించింది. 

ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం
జీ20 సమావేశాలు జరిగే ప్రగతి మైదాన్‌కు సమీపంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అదనంగా ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నేతలు పాల్గొంటున్న కార్యక్రమం అయినందున ఈ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకు ఇది నిర్విరామంగా వాతావరణాన్ని పరిశీలిస్తుంటుంది. ఐఎండీకి చెందిన వెబ్‌పేజీ mausam.imd.gov.in/g20 ద్వారా వాతావరణ సూచనల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
చదవండి: G20 Summit: బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు

స్ట్రీట్‌ ఫుడ్, మిల్లెట్స్‌తో ప్రత్యేక మెనూ
భారత్‌లో ఈ సీజన్‌లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంటకాలతో ప్రత్యేకంగా మెనూ సిద్ధమైంది. భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌తోపాటు మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలకు ఇందులో స్థానం కల్పించారు. ఇంకా గులాబ్‌ జామ్, రసమలై, జిలేబీ వంటి స్వీట్లు కూడా అతిథులకు వడ్డిస్తారు. వడ్డించే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం రూపొందించారు. మెనూలో ఫలానావి ఉంటాయని అధికారులెవరూ స్పష్టంగా చెప్పనప్పటికీ, భారతీయ వంటకాల్లో వైవిధ్యాన్ని చాటేలా మెనూ ఉంటుందని భావిస్తున్నారు.

ప్రత్యేక టేబుల్‌ వేర్‌
ప్రపంచనేతలకు ఇచ్చే విందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారికి మరిచిపోలేని ఆతిథ్య అనుభూతి కల్పించేందుకు ఆహారపదార్థాలను వెండి, బంగారు పూత కలిగిన పాత్రల్లో వడ్డిస్తారు. విదేశీ నేతలు వివిధ హోటళ్లలో బస చేసినప్పుడు, రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యే సమయంలో ఉపయోగించేందుకు 200 మంది కళాకారులతో 15 వేల వరకు సామగ్రిని తయారు చేయించారు.

ఇందులో స్టీల్, ఇత్తడి లేదా రెండింటి మిశ్రమంతో తయారైన టేబుల్‌ సామగ్రికి వెండిపూత వేయించారు. విందు సమయంలో అతిథులకు బంగారు పూత వేసిన గ్లాస్‌లలో డ్రింక్స్‌ను సర్వ్‌ చేస్తారు. ప్లేట్లు, స్పూన్లు తదితర వస్తువులను భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసిలతోపాటు కర్ణాటకలో వీటిని తయారు చేయించారు.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీపై నిషేధం
జీ20 దృష్ట్యా ఈ నెల 8, 9, 10వ తేదీల్లో న్యూఢిల్లీలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్‌ ఆంక్షలు ప్రకటించారు. క్లౌడ్‌ కిచెన్, ఫుడ్‌ డెలివరీలు, అమెజాన్‌ డెలివరీ వంటి వాణిజ్య సేవలపై ఎన్‌డీఎంసీ ప్రాంతంలో నిషేధం విధిస్తున్నట్లు స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ యాదవ్‌ చెప్పారు. ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదన్నారు.

బియెన్‌వెన్యూ నుంచి బియెన్‌వెనిడో దాకా..
జీ20 శిఖరాగ్రానికి హాజరయ్యే జీ20 ప్రతినిధులు, విదేశీ అతిథులకు వారివారి భాషల్లోనే స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జీ20 ఇతివృత్తం ‘వసుధైక కుటుంబకమ్‌’ను జీ20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల భాషల్లో ముద్రించారు. దీంతోపాటు ఫ్రెంచిలో బియెన్‌వెన్యూ, టర్కిష్‌లో హాస్‌గెల్డినిజ్, జర్మన్‌లో విల్కోమెన్, ఇండోనేసియన్‌లో సెలామట్‌ దతంగ్, స్పానిష్‌లో బియెన్‌వెనిడో అంటూ స్వాగతాన్ని రష్యన్, మాండరిన్‌ భాషల్లో సైతం ముద్రించారు. దేశాల ప్రతినిధుల కోసం భారత్‌ మండపం కాంప్లెక్స్‌ 14వ నంబర్‌ హాలు ప్రవేశద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశారు.  

ఖర్గేకు రాని విందు పిలుపు 
సాక్షి, న్యూఢిల్లీ: జీ 20సదస్సులో భాగంగా శనివారం రాత్రి అతిథులకు ఇస్తున్న విందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పిలుపు రాలేదు. ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవ్వనున్న ఈ విందుకు ఖర్గేకు పిలుపు రాలేదని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. మాజీ ప్రధానులు దేవెగౌడ. మన్మోహన్‌ సింగ్‌.  కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఆహ్వానితుల్లో ఉన్నారు.

అయితే కేబినెట్‌ హోదా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు ఆహా్వనం పంపకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎంలు నితీశ్‌కుమార్‌ , మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, హేమంత్‌ సోరెన్‌లు విందుకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణంగా విందుకు హాజరుకావడంలేదని మాజీ ప్రధాని దేవెగౌడ ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా అనారోగ్య కారణాలతో విందుకు హాజరుకావడం లేదని సమాచారం.   

నేతల బస 
సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలందరికీ సెంట్రల్‌ ఢిల్లీలోని స్టార్‌హోటళ్లు, గురుగ్రామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సుమారు 35 వేల గదులు బుక్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐటీసీ మౌర్య 14వ అంతస్తులో, చాణక్యపురిలోని తాజ్‌ ప్యాలెస్‌లో చైనా ప్రధాని లీ క్వియాంగ్, బ్రెజిల్‌ ప్రతినిధులు, షాంగ్రీలాలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్, క్లారిడ్జ్‌ హోటల్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, ఇంపీరియర్‌ హోటల్‌లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంటొనీ అల్బనీస్, ఒబెరాయ్‌ హోటల్‌లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, గురుగ్రామ్‌లోని ఒబెరాయ్‌ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్, జేడబ్ల్యూ మారియట్, హయత్‌ రెసిడెన్సీల్లో ఇటలీ ప్రతినిధులు, లీ మెరిడియన్‌లో నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు, లలిత్‌ హోటల్‌లో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, గురుగ్రామ్‌ లీలీ హోటల్‌లో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బృందం బస చేయనుంది.    

Advertisement
 
Advertisement