
రాష్ట్రాలను కోరిన కేంద్ర హోంశాఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్ధిక ఇబ్బందుల కారణంగా బెయిల్ పొందలేని, జైలు నుంచి విడుదల కాలేని పేద ఖైదీలకు ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించిన నిధులను రాష్ట్రాలు వినియోగించకపోవడంపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2023 మేలో కేంద్రం ప్రారంభించిన ‘పేద ఖైదీలకు మద్దతు’పథకానికి అర్హులైన ఖైదీలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడాన్ని తప్పుపట్టింది.
ఇప్పటికైనా జరిమానాలు, బెయిల్ పూచీకత్తు చెల్లించలేని కారణంగా కటకటాల్లోనే మగ్గుతున్న పేద ఖైదీలకు తోడ్పడాలని ఈ నెల 3న రాష్ట్రాలకు లేఖ రాసింది. ‘పేద ఖైదీలకు మద్దతు’పథకంలో భాగంగా రాష్ట్రాలు జిల్లాకొకటి చొప్పున కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పథకం అమలుకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) కేంద్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ సంస్థకు కేంద్రం ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తుంది.
జిల్లా సాధికార కమిటీ కేసును క్లియర్ చేస్తే ఖైదీకి రూ.25 వేల వరకు లభిస్తుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే, దానిని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ పథకా న్ని సరైన రీతిలో అమలు చేసి పేద ఖైదీలకు విముక్తి కల్పించడం ద్వారా వారిని జన జీవన స్రవంతిలో కలిసేందుకు సాయపడాలని కోరింది. అయితే, అవినీతి నిరోధక, మనీలాండరింగ్, డ్రగ్స్, ఉపా తదితర చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడిన వారికి ఈ ప్రయోజనం వర్తించదని హోం శాఖ స్పష్టం చేసింది.