కేంద్ర మాజీ హోం మంత్రి కన్నుమూత

Former Union Minister Buta Singh Passes Away At 86 - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బూటా సింగ్‌(86) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా బూటా సింగ్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలు, పేదల సంక్షేమానికై గళమెత్తిన, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌‌ చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ సైతం ట్విటర్‌ వేదికగా బూటా సింగ్‌కు నివాళులు అర్పించారు.

జర్నలిస్టు నుంచి కేంద్ర హోం మంత్రిగా..
పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలోని ముస్తఫాపూర్‌లో 1934, మార్చి 21న బూటా సింగ్‌ జన్మించారు. బాంబేలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన, బుంధేల్‌ఖండ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1964లో మంజీత్‌ కౌర్‌ను బూటా సింగ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇక తొలుత జర్నలిస్టుగా కెరీర్‌ ఆరంభించిన బూటా సింగ్‌.. అకాలీదళ్‌ పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దళిత నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాంధీ కుటుంబానికి సన్నిహితులయ్యారు. (చదవండి: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత)

సుమారు ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 1978-80 మధ్య కాలంలో ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన ఆయన, రాజీవ్‌ గాంధీ హయాంలో కేంద్ర హోం మంత్రిగా విధులు నిర్వర్తించారు. అనంతరం రైల్వే, పార్లమెంటరీ కమిటీ వ్యవహారాలు, క్రీడలు, షిప్పింగ్‌, వ్యవసాయ, సమాచార, గృహనిర్మాణ తదితర శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత 2004-06 వరకు బిహార్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. 2007-2010 వరకు ఎస్సీ జాతీయ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇక కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీకి దూరమైన బూటా సింగ్‌ 2015 అక్టోబరులో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top