ట్విషా శర్మ మృతి కేసు: జైలుకు రిటైర్డ్ మహిళా జడ్జి | Former Judge Jailed, Assigned Prisoner No 71 | Sakshi
Sakshi News home page

ట్విషా శర్మ మృతి కేసు: జైలుకు రిటైర్డ్ మహిళా జడ్జి

Jun 3 2026 11:43 AM | Updated on Jun 3 2026 11:48 AM

Former Judge Jailed, Assigned Prisoner No 71

భోపాల్: ఒకప్పుడు కోర్టులో పలు కీలక తీర్పులు చెప్పిన ఉన్నత స్థాయి న్యాయమూర్తి, నేడు అదే చట్టం ముందు నిందితురాలిగా నిలబడ్డారు. తన కోడలు ట్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ భోపాల్ సెంట్రల్ జైలు పాలయ్యారు. నిన్నటి వరకు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఆమెకు, జైలు అధికారులు ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 71’ అనే గుర్తింపును కేటాయించారు.

కోడలి మరణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన మాజీ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్‌లను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో మంగళవారం భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు నిబంధనల ప్రకారం మాజీ జడ్జిని మహిళా మెడికల్ వార్డులో ఉంచి, ఖైదీ నంబర్ 71ను కేటాయించారు. అలాగే ఆమె కుమారుడు సమర్థ్‌ను బ్యారక్ నంబర్ 4లో ఉంచి, ఖైదీ నంబర్ 1782గా గుర్తించారు. జైలు మాన్యువల్ ప్రకారం వీరికి ఒక ప్లేట్, గిన్నె, బెడ్‌షీట్ వంటి ప్రాథమిక అవసరాల వస్తువులను అధికారులు అందించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే మే 28న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది.

80 కిలోల డమ్మీతో సీన్ రీక్రియేషన్
గత నెల మే 12న ట్విషా శర్మ తన అత్తవారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ, విచారణ పరిధిని వేగవంతం చేసింది. ట్విషా శర్మ జీవితంలో చివరి గంటల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సోమవారం నాడు దర్యాప్తు సంస్థ ఘటనా స్థలంలో క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేసింది. ఇందులో భాగంగా ట్విషా బరువుకు సమానమైన 80 కిలోల డమ్మీని ఉపయోగించారు. సీన్‌ను పునర్నిర్మించడానికి ముందు ఆ డమ్మీ బరువును తూకం యంత్రంపై కూడా సరిచూశారు.

విచారణలో కీలక వ్యత్యాసాలు
పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్న ట్విషా ఎత్తుకు, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లకు మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ సందిగ్ధతను తొలగించడానికి దర్యాప్తు సంస్థ వేర్వేరు ఎత్తులు ఉన్న మరో రెండు డమ్మీలను కూడా సిద్ధం చేసి పరిశీలించింది. కోడలి మరణానికి గల అసలు కారణాలను, పరిస్థితులను వెలికితీసేందుకు సీబీఐ అన్ని కోణాల్లోనూ ఆధారాలను సేకరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement