
ఉత్తరాఖండ్‌లోని ధరాలీ వద్ద ఇళ్లను ముంచెత్తుతున్న బురద
గంగోత్రి సమీప ధరాలీ గ్రామంలో వరద బీభత్సం
ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా ముంచెత్తిన వరదనీరు
పలు ఇళ్లు, రెస్టారెంట్లు భూస్థాపితం.. ఐదుగురు దుర్మరణం
50 మంది జాడ గల్లంతు.. వారిలో సైన్యాధికారి, 10 మంది జవాన్లు
సీఎం పుష్కర్‌కు ఫోన్‌చేసి పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యంచేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది. అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్‌లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది.
ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఉత్తరకాశీ జిల్లా మేజి్రస్టేట్ ప్రశాంత్ ఆర్య చెప్పారు. 50 మందికిపైగా జనం జాడ గల్లంతైందని స్థానికులు చెబుతున్నారు. జాతీయ భద్రత, నిఘా కార్యక్రమంలో భాగంగా సమీప హార్సిల్‌లోయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన భారత ఆర్మీ 14 రాజ్‌రిఫ్ యూనిట్ బేస్‌క్యాంప్‌పైనా బురద దూసుకొచ్చింది.
దీంతో 10 మంది జవాన్లు, ఒక సైన్యాధికారి(జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) జాడ సైతం గల్లంతైంది. తోటి జవాన్ల జాడ తెలీకుండాపోయినాసరే సడలని ధైర్యంతో ఇతర జవాన్లు సహాయక, అన్వేషణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు, 22 మంది పురుషులను ఘటనాస్థలి నుంచి సహాయక బృందాలు కాపాడాయి. డజన్ల కొద్దీ హోటళ్లు భారీ బురదలో కూరుకుపోయాయి. సమీప హెలిప్యాడ్ సైతం నాశనమైంది. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రీ ధామం సమీపంలోని ధరాలీ గ్రామంపైకి ఎగువ ప్రాంతాల వరద ముంచెత్తిన వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
హరిశీలా పర్వతం సమీపంలోని సత్‌తాల్ దగ్గరి కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా పెరిగిన ఖీర్‌గంగా నదీప్రవాహం హద్దులు దాటి దిగువక దూసుకొచి్చంది. ఈ వరదనీటితోపాటు వరద దిగువకు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చి అక్కడ ఉన్న ధరాలీ గ్రామాన్ని ముంచెత్తి వినాశనం సృష్టించింది. ప్రకృతి ప్రకోపం వార్త తెల్సి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగి్నమాపక దళం, ఉత్తరాఖండ్ పోలీసులు, భారత ఆర్మీ బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలూ ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
బురదలో కూరుకుపోయిన ఇళ్ల నుంచి మట్టిని తొలగిస్తున్నారు. బురదలో చిక్కుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం తలెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రస్థాయిలో క్లౌడ్‌బరస్ట్ కుండపోత వర్షం కారణంగా ఈ బురద ముంచెత్తిందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఘటన తర్వాత కేదార్‌నాథ్ వైపు యాత్రికుల రాకను తాత్కాలికంగా ఆపేశారు.
దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని
సహాయక, అన్వేషణ చర్యల్లో పురోగతిపై ఆరా తీసేందుకు సీఎం ధామీకి ప్రధాని ఫోన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఫోన్‌చేసి వివరాలు ఆరాతీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనంగా జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బలగాలను పంపిస్తున్నట్లు సీఎంకు అమిత్‌షా చెప్పారు. ‘‘ధరాలీ దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
ప్రాణాలతో బయటపడిన వాళ్లు ఈ విషాదఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నా. గ్రామస్థులకు అన్నిరకాలుగా సాయపడేందుకు మా ప్రభుత్వం సదా సిద్ధంగాఉంది’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మృతుల కుటుంబాలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. సహాయక చర్యల్లో నిమగ్నమై బాధితులకు సాయపడాలని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా కోరారు.
ఎటు చూసినా బురదమయమే
మెరుపు వరద ధాటికి గ్రామం చాలా వరకు ధ్వంసమైంది. ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. కొండవాలు కింద ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు తప్పించుకునే అవకాశంలేకుండా పోయింది. పలువురిని బురద సజీవంగా కప్పేసింది. సమీప కొండ మీద నుంచి ఒకవ్యక్తి తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అద్భుతం జరిగినట్లుగా ఆ బురదలోంచి ఒకరిద్దరు బయటికొచ్చి శక్తినంతా కూడదీసుకుని ముందుకు కదిలారు. అప్పటికే అలసిపోయి నాలుగు అడుగులేసి అక్కడే కుప్పకూలిపోయారు.
మరో వ్యక్తి కాస్తంత బలం కూడదీసుకుని ఎగువ ప్రాంతం వైపు నడక ప్రారంభించాడు. ‘‘నీ దగ్గర్లో పడిపోయిన ఆ వ్యక్తిని కూడా పైకి లాక్కొని రా’’అని కొండ మీద జనం అరుస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డయింది. ఒకతను సాయం చేయండండూ ఆ బురద మధ్యలో ఏడుస్తూ కనిపించాడు. కొందరు తమ వాళ్లకు వీడియోకాల్స్ చేసి తాము ఎక్కడ చిక్కుకుపోయామో వివరించే ప్రయత్నం చేశారు. ‘‘అంతా ముగిసిపోయింది’’అని ఒకతను మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటికొచి్చంది. కొందరు ఊపిరిబిగబట్టిమరీ తమ వారి జాడ కోసం వెతుకుతూ కనిపించారు.
డెహ్రాడూన్‌లో రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం నుంచి సహాయక, అన్వేషణ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. సమీప హార్సిల్, సుఖీ లోయ ప్రాంతాలనూ వరదనీరు ముంచెత్తే ప్రమాదం ఉండటంతో అక్కడి స్థానికులను పాలనాయంత్రాంగం అప్రమత్తంచేసింది. తక్షణం ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ధరాలీ విలయవార్త తెలిసి సమీప దిగువ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సుఖీ గ్రామంలోనూ కుండపోత వర్షం కురిసింది. అక్కడ కొండచరియలు విరిగిపడడంతో హార్సిల్, ధరాలీ మధ్యలో అప్పటికప్పుడు ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది.
ఇందులోని నీరు పెరిగితే దిగువ ప్రాంతాలకు కొత్త ముప్పు ఏర్పడనుంది. 20–30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేవలం 60 నిమిషాల్లోపు 10 సెంటీమీటర్ల స్థాయి వర్షపాతం నమోదైతే దానిని క్లౌడ్‌బరస్ట్‌గా చెబుతారు. వీటిని ముందస్తుగా ఊహించడం చాలా కష్టం. క్లౌడ్‌బరస్ట్ కారణంగా స్వల్ప వ్యవధిలోనే అపారజలరాశి వర్షపు నీటిబిందువుల రూపంలో స్వల్పప్రాంతంలో పడటంతో అక్కడ వరద పోటెత్తుతుంది. కొండప్రాంతమైతే కొండమట్టి నీటితో తడిసిపోయి మెత్తబడి కొండచరియలు విరిగిపడతాయి. దీంతో దిగువ ప్రాంతాల్లో అపార ప్రాణ, ఆస్తినష్టం సంభవించవచ్చు.
ప్రకృతి ఒడిలో ప్రశాంత గ్రామం
ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం ఒక్కసారిగా మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో అసలు ఈ గ్రామం ఎక్కడుంది? అని చాలా మంది గూగుల్‌లో వెతకడం మొదలెట్టారు. యాపిల్స్‌కు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రంలోని హర్సిల్ లోయ సమీపంలో ధరాలీ గ్రామం ఉంది. గంగోత్రి ధామాన్ని దర్శించే వాళ్లు కాసేపు విడిది కోసం మార్గమధ్యంలో ఉన్న ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఈ గ్రామ సమీపంలో భాగీరథి నది ప్రవహిస్తోంది. గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో ఇక్కడి పర్వతమయ ప్రకృతి సుందర దృశ్యాలను చూసేందుకు ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడ ఆగుతారు.
చార్‌ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సమయాల్లో ఈ గ్రామానికి పెద్దసంఖ్యలో జనం వస్తారు. ఇక్కడ అతిథి గృహాలు, లాడ్జీలు ఎక్కువ. అది కూడా తక్కువ ధరలకే విడిది సౌకర్యాలు లభిస్తుండటంతో సందర్శకులు, భక్తులు, యాత్రికులు ఈ గ్రామంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సముద్రమట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తులో ఈ గ్రామం ఉంది. ఈ ఘటనకు తోడు సమీపంలో కొండచరియలు విరిగి పడినఘటనల్లో ఐదు జాతీయరహదారులు సహా 163 చోట్ల రోడ్లపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఏడు రాష్ట్రరహదారులు, రెండు సరిహద్దు రోడ్లపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం సైతం భారీ వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. నైనిటాల్, చంపావత్, ఉధమ్‌సింగ్ నగర్, బగేశ్వర్, పౌరీ తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హిమాలయ దిగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగిపడే ఘటనలు సర్వసాధారణం. మిగతా హిమాలయ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్ ఘటనలు మరీ ఎక్కువ.