ఐదుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం | Five New Supreme Court Judges Take Oath | Sakshi
Sakshi News home page

ఐదుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం

Jun 3 2026 5:11 AM | Updated on Jun 3 2026 5:11 AM

Five New Supreme Court Judges Take Oath

జస్టిస్‌ మోహన, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్, జస్టిస్‌ సచ్‌దేవా, జస్టిస్‌ శీల్‌ నాగు, జస్టిస్‌ అరుణ్‌ పల్లి

ఐదుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టులో 37కి చేరిన జడ్జీజల సంఖ్య

ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్న ఇద్దరు న్యాయమూర్తులు  

న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. శీల్‌ నాగ్, శ్రీచంద్రశేఖర్, సంజీవ్‌ సచ్‌దేవా, అరుణ్‌ పల్లి, వి.మోహనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరుకుంది. మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 38 కాగా, ప్రస్తుతం కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాది వి.మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని మే 27న సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం మే 31న ఆమోదం తెలిపింది. సిట్టింగ్‌ జడ్జీలు జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ ఈ ఏడాది జూన్‌ 16న, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి జూన్‌ 28న పదవీ విరమణ చేయబోతున్నారు. 

జస్టిస్‌ శీల్‌ నాగ్‌:  1965 జనవరి 1న జన్మించారు. 1987 అక్టోబర్‌లో అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. 2011 మే 27న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మే 23న అదే కోర్టులో పర్మినెంట్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 2024 మే 25న మధ్యప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2024 జూలై 9న పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.  

జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌:  1965 మే 25న జన్మించారు. 1993లో ఢిల్లీ యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 2013 జనవరి 17న జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 జూన్‌ 27న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 డిసెంబర్‌ 29 నుంచి 2023 జూలై 4 వరకు జార్ఖండ్‌ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2024 జూలై 5న రాజస్తాన్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2025
సెప్టెంబర్‌ 5న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.  

జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవా: 1964 డిసెంబర్‌ 26న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవా 1988లో ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ కళాశాల నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లా డిగ్రీని పొందారు. 1988 ఆగస్టు 1న ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2011 జూలైలో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్‌ న్యాయవాదిగా నియమించింది. 2013 ఏప్రిల్‌ 17న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2015 మార్చి 18న అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 మే 30న మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ సచ్‌దేవా 2025 జూలై 17న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

జస్టిస్‌ అరుణ్‌ పల్లి:  1964 సెప్టెంబర్‌ 18న జన్మించారు. 1988లో పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లా పూర్తిచేశారు. 2004 నుంచి 2007 దాకా పంజాబ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు. 2007 ఏప్రిల్‌ 16న సీనియర్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్‌ 28న పంజాబ్, హరియాణా హైకోర్టు బెంచ్‌కు పదోన్నతి పొందారు. 2025 ఏప్రిల్‌ 16న జమ్మూ కశ్మీర్‌ అండ్‌ లద్దాఖ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ అరుణ్‌ పల్లి తండ్రి, తాత పటియాలాలో న్యాయవాదులుగా పనిచేశారు.  

జస్టిస్‌ వి.మోహన: 1966 జూన్‌ 27న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. అప్పటి నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో గతంలో న్యాయవాద వృత్తిలో ఎవరూ లేరు. 1992 తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఛాంబర్‌లో చేరారు. సీనియర్‌ న్యాయవాది సి.ఎస్‌.వైద్యనాథన్‌ ఛాంబర్‌లో కూడా ఆమె పనిచేశారు. 1996లో అడ్వకేట్‌–ఆన్‌–రికార్డ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. జస్టిస్‌ వి.మోహనను 2015లో సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌గా 
నియమించింది.  

ఐదేళ్ల తర్వాత మహిళా జడ్జి  
సుప్రీంకోర్టులో ఐదేళ్ల విరామం తర్వాత మహిళా న్యాయమూర్తి నియామకం కావడం విశేషం. దీంతో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరుకుంది. సుప్రీంకోర్టుకు మహిళా జడ్జి నేరుగా ఎంపిక కావడం ఇది రెండోసారి. 2018లో జస్టిస్‌ ఇందూ మల్హోత్రా తర్వాత బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన రెండో మహిళా న్యాయవాదిగా జస్టిస్‌ వి.మోహన రికార్డులకెక్కారు. హైకోర్టు జడ్జిగా పని చేయకుండా న్యాయవాద వృత్తి నుంచే నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement