కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఎజ్రా స్ట్రీట్‌లో శనివారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 300 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పక్కనే ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని సకాలంలో ఖాళీ చేయించడంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కోల్‌కతా సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందిరా ముఖర్జీ ఈ ఘటనను ధృవీకరించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మంటలను అదుపు చేయడానికి తొలుత ఆరు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో మరో 20 అగ్నిమాపక యంత్రాలను రప్పించాల్సి వచ్చింది. ఎజ్రా స్ట్రీట్‌లోని ఇరుకైన సందుల్లో గల ఎలక్ట్రికల్ వస్తువులు, చెక్క, ప్లైవుడ్ తదితర మండే స్వభావం గల పదార్థాలను నిల్వ చేసే దుకాణాలు, గోడౌన్లలో మంటలు వేగంగా వ్యాపించాయి.
#WATCH | West Bengal: A massive fire broke out at an electronics warehouse at 26, Ezra Street in Kolkata. Fire tenders present at the spot. Firefighting operations are underway. More details awaited. pic.twitter.com/uPn6Bf5Iu7
— ANI (@ANI) November 15, 2025
దట్టమైన నల్లటి పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డారు. అధికారులు ఆ ప్రాంతం చుట్టూ ఉన్న అన్ని రహదారులను మూసివేశారు. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ తర్వాతే దర్యాప్తు జరుగుతుందని సీనియర్ అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
స్థానిక కౌన్సిలర్ సంతోష్ పాఠక్ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. గత 22 సంవత్సరాలుగా భవనంలోని పేలవమైన భద్రతా ప్రమాణాల గురించి స్థానిక అధికారులకు, పోలీసులకు చాలాసార్లు లేఖలు రాసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా ఇటీవల సెంట్రల్ కోల్‌కతాలోని ఆర్ ఎన్ ముఖర్జీ రోడ్‌లో ఒక గోడౌన్‌లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆ గోడౌన్‌లోని కంప్యూటర్లు, మోటార్లు, కారు విడిభాగాలు బూడిదయ్యాయి.
ఇది కూడా చదవండి: Bihar Election: డబుల్ షాక్‌లో ‘బిహార్ సింగం’


