ఐక్యతా విగ్రహం వద్ద అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్‌ ఆటోల్లో చెలరేగిన మంటలు

Fifteen Electric Autos Catch Fire Near Statue Of Unity In Gujarat - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం వద్ద గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్టాచ్యు ఆఫ్‌ యూనిటీ పరిసరాల్లో టూరిస్టులను తిప్పే 15 ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఛార్జింగ్‌ చేస్తుండగానే మంటలు అంటుకున్నట్లు వస్తున్న వార్తలను స్టాచ్యు ఆఫ్‌ యూనిటీ ఏరియా డెవలప్‌మెంట్‌, టూరిజం గవర్నెన్స్‌ అథారిటీ తిరస్కరించింది. ఛార్జింగ్‌ పాయింట్‌కు 35 అడుగుల దూరంలో ఉన్నాయని స్పష్టం చేసింది. 

ఐక్యతా విగ్రహం వద్దకు వచ్చే టూరిస్టుల కోసం 90 ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వాటికి స్థానిక ట్రైబల్‌ మహిళలు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. ‘గురువారం తెల్లవారుజామున కెవాడియా గ్రామం సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషన్‌ వద్ద నిలిపి ఉంచిన 15 ఆటో రిక్షాలల్లో మంటలు చెలరేగాయి. అందుకు గల కారణాలు తెలియరాలేదు. ఛార్జింగ్‌ స్టేషన్‌కు 35 అడుగుల దూరంలో వాటిని నిలిపి ఉంచారు. దాంతో ఛార్జింగ్‌ చేస్తుండగా మంటలు వచ్చాయనేందుకు సరైన ఆధారాలు లేవు.’ అని ఓ ప్రకటన జారీ చేసింది ఎస్‌ఓయూఏడీటీజీఏ. 

మంటలపై సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇతర వాహనాలకు వ్యాపించకముందే మంటలను ఆర్పివేసింది. ఈ సంఘటనపై ఆటో రిక్షాలను నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి: కోవిడ్‌ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top