లఖింపుర్‌లో 72 గంటల ఆందోళన.. యూపీకి 10వేల మంది రైతులు

Farmers Group SKM To Begin Mega Protest In Lakhimpur Kheri - Sakshi

లక్నో: కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్‌ మోర్చా. మూడు రోజుల పాటు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది రైతులు పంజాబ్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనలకు న్యాయం చేయాలంటూ గురువారం నుంచి 72 గంటల పాటు(ఆగస్టు 18 నుంచి 20వ తేదీ) ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. సీనియర్‌ రైతు నేతలు రాకేశ్‌ టికాయిత్‌, దర్శన్‌ పాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రాహన్‌ వంటి వారు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. 

ఆందోళనల్లో సుమారు 10వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు మంజిత్‌ సింగ్‌ రాయ్‌ తెలిపారు. కొందరు రైళ్లలో, మరికొందరు తమ సొంత వాహనాల్లో లఖింపుర్‌ఖేరీకి చేరుకుంటున్నారని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో లఖింపుర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిశ్‌ మిశ్రా అరెస్టయ్యారు. రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆశిశ్‌ మిశ్రా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది అలహాబాద్‌ హైకోర్టు.

ఇదీ చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి​ ఘటనపై ప్రధాని ఏమన్నారంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top