నిఫాపై నిరంతర నిఘా | Sakshi
Sakshi News home page

నిఫాపై నిరంతర నిఘా

Published Fri, Sep 15 2023 5:08 AM

Experimental antiviral against Nipah, BSL-3 lab reach Kerala - Sakshi

తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వైరస్‌ మళ్లీ రాష్ట్రంలో వెలుగుచూడటంతో కేరళ రాష్ట్రం అప్రమత్తమైంది. నిఫా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించేందుకు కావాల్సిన యాంటీవైరల్‌ ఔషధాలు కేరళకు చేరుకున్నాయని రాష్ట్ర సర్కార్‌ వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖతో రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.

‘ నిఫాకు ఉన్న ఏకైక యాంటీవైరల్‌ చికిత్స.. మోనోక్లోనల్‌ యాంటీబాడీలే. అందుకే వాటిని హుటాహుటిన రాష్ట్రానికి తెప్పించాం. కోజికోఢ్‌ జిల్లాలో నిఫా వెలుగుచూడడంపై ఆందోళన వద్దు. జిల్లాలోని ప్రజానీకం సరైన నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కగలం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మహిళా మంత్రి వీణ జార్జ్‌ వ్యాఖ్యానించారు. కోజికోడ్‌ జిల్లాలో వ్యాపించిన వైరస్‌ కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇన్షెక్షన్‌ రేటు తక్కువ ఉన్నాసరే మరణాల రేటు ఎక్కువ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. పుణె నుంచి వైరాలజీ నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపిన విషయం తెల్సిందే. 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిఫా సోకడంతో ఇప్పటిదాకా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మరణించారు. కోజికోడ్‌ జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. కోజికోఢ్‌ జిల్లా మాత్రమేకాదు ఇలాంటి ఇన్ఫెక్షన్‌ల బారిన రాష్ట్రం మొత్తం పడే వాతావరణం అక్కడ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి ప్రకటించాయని కేరళ సర్కార్‌ పేర్కొంది. బుధవారం సాయంత్రం నాటికి కోజికోడ్‌లో 11 వార్డులను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement