
ఇస్రోకు కేంద్రం కేటాయింపులపై మాజీ చీఫ్ సోమ్‌నాథ్
న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష కార్యక్రమం ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ చెప్పారు. ఇస్రోలో పెట్టే ప్రతి రూపాయిపై రూ.2.54 మేర ఆదాయం వస్తోందని వెల్లడించారు. శుక్రవారం ఆయన ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా బిజినెస్ ఫోరం’లో ప్రసంగించారు. బడ్జెట్ తక్కువే అయినప్పటికీ అద్భుతమైన సామర్థ్యం కలిగిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ గుర్తింపు సాధించిందని ఆయన వివరించారు.
‘మేం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అందుతున్న ప్రతిఫలం రూ.2.54. బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు లేకున్నా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని, ఉపగ్రహాలను నిర్మించి విజయవంతంగా ప్రయోగించాం’అని తన హయాంలో అనుభవాన్ని ఆయన తెలిపారు. చంద్రయాన్–3 లూనార్ ల్యాండింగ్, ఆదిత్య ఎల్–1 మిషన్ వంటి ఇస్రో సాధించిన మైలురాళ్లు అంతరిక్ష అన్వేషణలో భారత్ సత్తాకు నిదర్శనాలని చెప్పారు.
ప్రైవేట్ రంగం గణనీయ వృద్ధి
ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి సాధించిందని సోమ్‌నాథ్ చెప్పారు. ‘2014కు పూర్వం ఈ రంగంలో దేశంలో ఒకే ఒక్క స్టార్టప్ కంపెనీ ఉండేది. ఇప్పుడవి 250కి పెరిగాయి. ఉపగ్రహాలు, రాకెట్లను నిర్మించడంతోపాటు కక్ష్యలోకి ప్రవేశపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ రంగంలో అనుబంధ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి.
ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ తన వాటాను పెంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది’అని సోమ్‌నాథ్ తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారతీయుడిని చంద్రుడిపైకి పంపి, అక్కడ ల్యాండ్ చేయించడంతోపాటు తిరిగి తీసుకువచ్చే బృహత్తర ప్రణాళిక ఇస్రో వద్ద ఉందన్నారు. ఇందులో పునర్వినియోగ రాకెట్ల నిర్మాణం, భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, అంతరిక్షంలోకి భారతీయులను పంపడం, చంద్రుడితోపాటు గురుగ్రహంపైకి అన్వేషణలను చేపట్టడం వంటివి కూడా ఉన్నాయని వివరించారు.
ఇతర దేశాలకు సైతం సాయం
నేపాల్, భూటాన్, ఒమన్, దక్షిణాఫ్రికాతోపాటు ఆసియాన్ దేశాల అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, పెంచేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. పునరి్వనియోగ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం, పరిశోధన–అభివృద్ధి వ్యయాన్ని పెంచడం, వ్యూహాత్మక అంతరిక్ష రంగంలో మరింత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో భారత్‌ను అగ్ర స్థానానికి తీసుకెళ్లాలన్నదే ఇస్రో లక్ష్యమని సోమ్‌నాథ్ చెప్పారు.