ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు చేసే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ విషయంలో మాత్రం దేశ సార్వభౌమాధికారాన్ని ముందుకు తెచ్చారు. భారత్ ప్రధాని గురించి మాట్లాడే హక్కు.. ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం మస్క్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అనుమతులు ఆలస్యమవుతున్నాయంటూ మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశ వనరుల్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించేది భారతదేశమేనని ఒవైసీ కుండబద్ధలు కొట్టారు. విదేశీయులు వచ్చి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో తనకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, ప్రధాని స్థానాన్ని అగౌరవపర్చడం, దేశ గౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించబోనని అన్నారు.
అంతేకాదు.. ప్రపంచంలోనే చౌక ధరకు ఇంటర్నెట్ లభించేది భారత్లోనని గుర్తు చేశారాయన. దేశంలో టెలికాం రంగానికి సంబంధించిన నిర్ణయాలు భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని, విదేశీ వ్యాపారవేత్తల ఒత్తిడికి తలొగ్గకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భారత్‌ను రష్యా చమురు కొనొద్దని చెబుతున్న అమెరికా.. అక్కడి నుంచి డీజిల్ కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్ కూడా తన ప్రయోజనాలే ముఖ్యంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Owaisi slams Elon Musk for insulting PM Modi ji. Agree or not, he is a more loyal Indian than undignified Rahul Gandhi. https://t.co/1FUJKwKalK
— Alpakanya (@Alpakanya) October 14, 2026
భారతదేశ వనరులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించేది ఈ దేశమేనని.. విదేశీ పారిశ్రామికవేత్తలు భారత్ విధానాలను శాసించే పరిస్థితి ఉండకూడదని అన్నారాయన. రాజకీయ విభేదాలు ఉన్నా దేశ గౌరవం, రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో రాజీ పడకూడదన్న ఆయన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎలాన్ మస్క్ వరకు.. విదేశీ ప్రముఖుల వ్యాఖ్యలపై ఇక్కడి రాజకీయ నేతలు గట్టిగా స్పందించడం లేదని నిలదీశారు. మస్క్‌ను ఉద్దేశించి ‘గోరా చమ్డీ వాలా’ (తెల్లతోలు వ్యక్తి) అంటూ మండిపడ్డారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించడానికి అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. ఈ జాప్యంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత టెలికాం మార్కెట్లోని శక్తిమంతమైన వ్యాపార వర్గాలు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్యంగా పోస్టులు కూడా చేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. స్టార్‌లింక్‌తో పాటు ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకూ భద్రతాపరమైన పరిశీలనలు, నిబంధనల అమలు అవసరమని స్పష్టం చేసింది. అనుమతుల ప్రక్రియలో పక్షపాతం చూపుతున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఈ వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా మస్క్ పోస్టుకు స్పందించడంతో రాజకీయ చర్చ మొదలైంది. ఇప్పుడు ఒవైసీ వ్యాఖ్యలు ఈ అంశానికి మరో కోణాన్ని జోడించాయి. విదేశీ సంస్థలకు భారత్‌లో వ్యాపారం చేసే అవకాశం ఉండొచ్చు.. కానీ దేశ చట్టాలు, నిబంధనలు, నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సిందేనన్నది మజ్లిస్ అధినేత వైఖరిగా ఆ వైరల్ వీడియోతో కనిపిస్తోంది.
ఇదీ చదవండి: సీజేపీ నిరసనల ఎఫెక్ట్.. దేశ బహిష్కరణ నోటీసులు!


