న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో అన్ని విషయాలూ కచ్చితంగా వెల్లడించాల్సిందేని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చేసిన నేరాలు, శిక్షలు, జరిమానాలు, వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది. ఒకవేళ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ అభ్యర్థి నామినేషన్‌లో కొన్ని విషయాలు దాచిపెట్టినట్లు తేలితే అతడిపై అనర్హత వేటు పడుతుందని స్పష్టంచేసింది.
ఈ మేరకు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని భికన్‌గావ్ నగర పరిషత్ సభ్యురాలిపై అనర్హత వేటు పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆమె నిందితురాలు. ఏడాదిపాటు జైలు శిక్ష కూడా పడింది. ఈ విషయాన్ని అఫిడవిట్‌లో దాచిపెట్టారు. అందుకే ఎన్నికైన తర్వాత కూడా అనర్హత వేటు పడింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.


