భారత్‌పై ఎల్‌నినో డేంజర్‌ బెల్స్‌.. 1972 నాటి విలయం తప్పదా? | El nino Effect Maha farmers lose fruits now fight to save trees | Sakshi
Sakshi News home page

భారత్‌పై ఎల్‌నినో డేంజర్‌ బెల్స్‌.. 1972 నాటి విలయం తప్పదా?

Oct 12 2026 7:51 AM | Updated on Oct 12 2026 7:54 AM

El nino Effect Maha farmers lose fruits now fight to save trees

ఒకవైపు చుక్క నీటి కోసం రైతుల ఎదురుచూపులు.. మరోవైపు ఎండిపోతున్న పంటలు.. ఇంకోవైపు పశువులకు మేత, నీళ్లు దొరక్క అన్నదాతల ఆందోళన! ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కరువుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ సమావేశంలో వారి ముందు ఉన్న ప్లేట్లలో ఏమున్నాయో తెలుసా? జీడిపప్పు, బాదం! 

బయట రైతులు తమ పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటుంటే.. లోపల సమీక్షకు హాజరైన నేతల ముందు డ్రై ఫ్రూట్స్‌ దర్శనమివ్వడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో కరువు కష్టాల మధ్య ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

1972 కరువును మించిన ముప్పు?
మహారాష్ట్రలో ప్రస్తుత కరువు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం, సుదీర్ఘ విరామాలతో కురిసిన వానలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ఏడాది కరువు 1972లో వచ్చిన మహా కరువు కంటే దారుణంగా మారవచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా వర్షాలు విఫలమై అప్పట్లో మహారాష్ట్ర వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. సాధారణంగా వర్షాలు తగ్గితే పంట దిగుబడి పడిపోతుంది. కానీ ఈసారి సమస్య అంతకంటే పెద్దది. పంటలు పండకపోవడం ఒక ఎత్తయితే.. ఇప్పటికే ఏళ్ల తరబడి పెంచుకున్న పండ్ల తోటలే ఎండిపోయే ప్రమాదం మరో ఎత్తు. అదే జరిగితే రైతుల ఆర్థిక పరిస్థితి కోలుకోలేని దెబ్బతినే అవకాశముంది.

పండ్ల తోటలపై కరువు పంజా
నాసిక్‌లో ద్రాక్ష తీగలు ఎండిపోతుండగా.. మామిడి, దానిమ్మ, అరటి, నారింజ తోటలకూ నీటి కొరత ముప్పుగా మారింది. ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లు చనిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ద్రాక్ష తీగలు పూర్తిగా ఎండిపోతే కొత్త మొక్కలు వాణిజ్యపరంగా దిగుబడినిచ్చేందుకు కనీసం నాలుగేళ్లు పట్టవచ్చని మహారాష్ట్ర ద్రాక్ష రైతుల సంఘం అధ్యక్షుడు కైలాస్‌ భోసలే తెలిపారు. ఎకరాకు ఒక్కో సీజన్‌లో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టే రైతులకు ఇది భారీ నష్టమే. మహారాష్ట్ర దేశంలోనే అతిపెద్ద ద్రాక్ష ఉత్పత్తిదారు. అరటి, దానిమ్మ, మామిడి సాగులోనూ కీలక రాష్ట్రంగా ఉంది. ఇక్కడి తోటలు ఎండిపోతే రైతుల ఆదాయంతో పాటు పండ్ల సరఫరా, ఎగుమతులపైనా ప్రభావం పడే ప్రమాదముంది. సాధారణ పంట నష్టమైతే ఒక సీజన్‌ ఆదాయం పోతుంది. కానీ పండ్ల చెట్లు చనిపోతే కొత్త తోటలు దిగుబడినిచ్చే వరకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది.

రోజుకు రూ.3 వేలతో నీళ్లు!
కరువు తీవ్రతకు రైతుల కష్టాలే నిదర్శనం. ఛత్రపతి శంభాజీనగర్‌ ప్రాంతంలోని షాహాపూర్‌కు చెందిన రైతు బద్రీనాథ్‌ భరత్‌ తన బావి ఎండిపోవడంతో రెండు ట్యాంకర్ల నీటి కోసం రోజుకు సుమారు రూ.3 వేలు ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటికే పత్తి, మొక్కజొన్న పంటలను కోల్పోయిన ఆయన.. మిగిలిన పంటతో పాటు కుటుంబం, పది పశువుల అవసరాల కోసం నీటిని కొనుగోలు చేస్తున్నారు. మరాఠ్వాడాలో 76 తాలూకాల్లో 74 కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా, సెప్టెంబర్‌ చివరి నాటికి 160 గ్రామాలకు 277 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చితే పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వర్షాభావంతో పంటలు ఎండిపోతుండగా, రాబోయే రోజుల్లో వేడి పెరిగి వర్షాలు మరింత తగ్గితే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.

కేంద్ర సాయం కోసం ఎదురుచూపులు
కరువు ఉపశమనానికి మహారాష్ట్ర ప్రభుత్వం రుణాల పునర్వ్యవస్థీకరణ, భూమి పన్ను రాయితీలు, వ్యవసాయ రుణాల వసూళ్లపై తాత్కాలిక విరామం వంటి చర్యలను ప్రకటించింది. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన సీఎం ఫడ్నవీస్‌.. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక సాయం కోరారు. పంట నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, రైతులకు తక్షణమే నీరు అందించడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.

ఇదీ చదవండి: పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement