
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.
నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.

మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.
The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.
Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025
ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది.