ప్రజా ప్రభుత్వాల మనుగడ గవర్నర్ల దయపైనా? | SC asks whether harmony between governor and state govt exists as envisioned by Constitution framers | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వాల మనుగడ గవర్నర్ల దయపైనా?

Aug 21 2025 1:22 AM | Updated on Aug 21 2025 1:22 AM

SC asks whether harmony between governor and state govt exists as envisioned by Constitution framers

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య సామరస్యమేది? 

రెండోసారి ఆమోదించే బిల్లు రాష్ట్రపతి పరిశీలనకా? 

గవర్నర్‌కు ఆ అధికారాలు లేవు: సీజేఐ 

లేని అధికారం తలకెత్తుకుంటున్న సుప్రీం 

తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: ‘‘దేశ పాలన వ్యవస్థలో అతి కీలకమైన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సామరస్యం ఉందా? అతి పెద్ద అధికార కేంద్రాలైన ఈ రెండు వ్యవస్థల నడుమ పలు కీలక అంశాలపై రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు ప్రజా ప్రయోజనాలే పరమావధిగా సజావుగా సంప్రదింపుల ప్రక్రియ అసలు జరుగుతోందా?’’అని సర్వోన్నత న్యాయస్థానం కీలక సందేహాలు లేవనెత్తింది. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశం ఏ మేరకు సఫలమైందో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చింది.

‘‘అసెంబ్లీలు ఆమోదించే బిల్లులను గవర్నర్‌ నిరవధికంగా పెండింగ్‌లో ఉంచితే పరిస్థితేమిటి? మెజారిటీ ప్రజల తీర్పు ఆధారంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ మనుగడ గవర్నర్ల చపలత్వంపై ఆధారపడ్డట్టేగా! ఇది ఏ మేరకు సబబు? రాష్ట్రంలో పాలన తదితరాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండదా?’’అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్లకు లేదని పునరుద్ఘాటించింది. ‘‘ఆర్టికల్‌ 200 ప్రకారం ఈ విషయంలో గవర్నర్‌ ముందు నాలుగు మార్గాలున్నాయి. బిల్లుకు ఆమోదం, పెండింగ్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అసెంబ్లీ పరిశీలనకే తిప్పి పంపడం. అసెంబ్లీ గనక బిల్లును మళ్లీ ఆమోదించి పంపితే దాన్ని రెండోసారి రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్‌కు లేదు’’అని స్పష్టం చేసింది.

రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పలువురు న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ విషయమై సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికార పరిధిపై పలు రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి ఏకంగా ప్రశ్నావళి పంపడం మరింత కలకలం రేపింది. సీజేఐకి రాష్ట్రపతి ప్రశ్నావళి పంపడం తాలూకు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం సుదీర్ఘంగా విచారణ జరిపింది.

గవర్నర్ల నియామకం, అధికారాలకు సంబంధించి రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలను ఉటంకిస్తూ కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు విన్పించారు. కొందరు ఆరోపిస్తున్నట్టుగా గవర్నర్‌ పదవి రాజకీయ ఆశ్రయానికి ఉద్దేశించినది కానే కాదని మెహతా స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు గవర్నర్‌కు పలు కీలక అధికారాలు, బాధ్యతలు దఖలు పడ్డాయని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇలా గడువు నిర్దేశించడమంటే అత్యున్నత వ్యవస్థల్లో ఒక వ్యవస్థ రాజ్యాంగం తనకు దఖలు పరచని అధికారాలను నెత్తిన వేసుకోవడమే తప్ప మరోటి కాదు. అంతిమంగా ఇది రాజ్యాంగపరమైన అవ్యవస్థకే దారి తీస్తుంది’’అని హెచ్చరించారు.

గవర్నర్లు తమ విచక్షణాధికారాన్ని అత్యంత పరిమితంగా మాత్రమే ఉపయోగిస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై ధర్మాసనం సూటిగా స్పందించింది. ‘‘చట్టం అమలు తాలూకు తీరుతెన్నులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామే తప్ప తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ కేసులో రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీం ధర్మాసనం వెలువరించిన నిర్ణయంపై కాదు. ఈ విషయంలో సలహాపూర్వక న్యాయపరిధికే పరిమితం అవుతాం తప్ప అపీల్‌ కోర్టులా వ్యవహరించబోం’’అని స్పష్టం చేసింది. సీజేఐ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రంనాథ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement