
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి,కేంద్ర రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేలా కేంద్రం మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ఈ వివాదాస్పద బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ఇద్దరు నేతలు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? వాళ్లు ఏం నేరం చేశారు.
గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో,తీవ్రమైన నేరాలకు పాల్పడి నెలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రజాప్రతినిధుల్ని పదవుల్ని తొలగించేలా కేంద్రం చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ గతేడాది జూన్‌లో అరెస్టయ్యారు.జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జైలు శిక్షను అనుభవించారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయలేదు.ఆ సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావించింది. కానీ ఆ సమయంలో చట్టాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలపై కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని అపవాదు వస్తుందనే ఉద్దేశ్యంతో వేచి చూసి ధోరణిని అవలంభించింది. కొంత కాలం తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో వివాదాస్పద చట్టం మరుగున పడింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే చట్టాన్ని అమలు చేసేలా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం
కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రేరేపించిన మరో కేసు తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కేసు. డీఎంకే పార్టీలో నాలుగు సార్లు సెంథిల్ బాలాజీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళనాడు మాజీ రవాణాశాఖ మంత్రి, ఉద్యోగాల పేరుతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. 2023లో ఆయనను అరెస్ట్ చేసింది. దాదాపు 14 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2024 సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరైంది. సెంథిల్ బాలాజీ అరెస్టయి జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఎలాంటి శాఖ లేకపోయినా మంత్రిగా కొనసాగారు. ఇదే విషయంలో మద్రాస్ హైకోర్టు బాలాజీపై తీవ్ర విమర్శలు చేసింది. శాఖ లేకుండా మంత్రిగా కొనసాగడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.
బెయిల్ తర్వాత అన్నాడీఎంకేలో చేరి సెంథిల్ బాలాజీ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు మీరు మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు సీనియర్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం రావచ్చు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా తప్పులు చేసి 30రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు కోల్పోయేలా బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేసినట్లు సమాచారం.