
చెన్నై: మధ్యప్రదేశ్ ‘కోల్డ్‌రిఫ్’(Coldrif Syrup) దగ్గు మందు కారణంగా 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని(Tamil Nadu) శ్రీసన్ ఫార్మా(Sreesan Pharma) సంస్థపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా చెన్నైలో(Chennai) శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు తనిఖీలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids In Tamilnadu) అధికారులు సోమవారం శ్రేసన్ ఫార్మాతో సంబంధమున్న చెన్నైలో ఏడు ప్రదేశాల్లో సోదాలు, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దగ్గు మందు తయారుచేసిన శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని రంగనాథన్(73)ను ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
#Coldrif #CoughSyrupDeaths pic.twitter.com/zzVw4roe8J
— NDTV (@ndtv) October 13, 2025
మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసస్ ఫార్మా కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండగా దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్‌రిఫ్ సిరప్‌ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్‌రిఫ్‌ను నిషేధించాయి.
ఇదిలా ఉండగా.. ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్‌లో రిజిస్టర్ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఇచ్చే గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) సర్టిఫికెట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. దీంతో, ఫార్మా కంపెనీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.