
దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్, అమిత్‌పై ఆరోపణలు
కేరళ, చెన్నైలో 17 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు
భూటాన్ నుంచి అక్రమంగా లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నట్టు కేసు
కోచి: భూటాన్ నుంచి లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుల కార్యాలయాలు, ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కేరళ, తమిళనాడుల్లో ఏకకాలంలో 17 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ప్రముఖ మాలీవుడ్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలకల్ తోపాటు పలువురు లగ్జరీ వాహనాల యజమానుల ఇళ్లు, ఆటో వర్క్‌షాప్‌లు, వ్యాపారుల ఆస్తుల్లో ఈ సోదాలు నిర్వ హించారు.
కేరళలోని ఎర్నాకులం, త్రి స్సూరు, కోజికోడ్, మలప్పురం, కొట్టా యం, తమిళనాడులోని కోయంబత్తూ రు, చెన్నై తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నైలో మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టికి చెందిన ఓ ప్రాపర్టీలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే.
ఏమిటి కేసు?
భూటాన్‌లో ఖరీదైన లగ్జరీ కార్లను సెకండ్‌హ్యాండ్‌లో కొందరు స్మగ్లర్లు తక్కువ ధరకు కొని, వాటిని అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చి.. ఇక్కడే తయారైనట్లు పత్రాలు సృష్టించి అధిక ధరకు విక్రయించారు. ఈ క్రమంలో ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)తోపాటు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)ను ఉల్లంఘించారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.
ఇలా అక్రమంగా దిగుమతి చేసుకున్న కార్లను మాలీవుడ్ నటులు కొన్నట్లు ఈడీ విచారణలో తేలటంతో సోదాలు నిర్వహించింది. ఈ అంశంలో పీఎంఎల్‌ఏ కింద ఈడీ త్వరలో కేసు నమోదుచేసి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. కోయంబత్తూర్‌కు చెందిన స్మగ్లింగ్ ముఠా తీసుకొచ్చిన కార్లలో ఒకదానికి దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేయగా, దానిని కస్టమ్స్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లటంతో కారు కోసం అర్జీ పెట్టుకుంటే వారంలోగా పరిశీలించాలని కస్టమ్స్ విభాగాన్ని కోర్టు మంగళవారం ఆదేశించింది.