ఈడీ చీఫ్ పదవీకాలం మూడుసార్లు పొడిగింపు..చట్టవిరుద్ధం: కేంద్రానికి సుప్రీం స్పష్టీకరణ

ED Chief Sanjay Kumar Mishra Extension Not Legal Says SC To Centre - Sakshi

ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా Sanjay Kumar Mishra పదవీకాలం పొడగింపుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు పొడిగింపు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూనే.. జులై 31వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగవచ్చని మంగళవారం కేంద్రానికి తెలిపింది. 

ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఈ జాతీయ సంస్థ చీఫ్‌ బాధ్యతలను 2018 నవంబర్‌లో ఎస్‌కే మిశ్రా చేపట్టారు. అయితే రెండేళ్లకే ఆయన వయోపరిమితి రిత్యా(60 ఏళ్ల) రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ, కేంద్రం మాత్రం రకరకాల సవరణలు, ప్రత్యేక ఆదేశాలతో ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది. ఈ క్రమంలో రాజకీయ దుమారం చెలరేగగా.. మధ్యలో సుప్రీం కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. 

అయినప్పటికీ కేంద్రం మాత్రం ఆర్డినెన్స్‌ల వంకతో ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

2020 నవంబర్‌లో మరో ఏడాదికి కేంద్రం పొడిగించగా.. ఆ సమయంలో జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరావు నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ‘పొడిగింపు ప్రత్యేక సందర్భాల్లో.. అదీ తక్కవ కాల వ్యవధితో మాత్రమే ఉండాలని స్పష్టంగా కేంద్రానికి తెలిపింది. అంతేకాదు.. ఎస్‌కే మిశ్రాను ఈడీ చీఫ్‌గా కొనసాగించకూడదని స్పష్టం చేసింది కూడా. 

► అయినప్పటికీ.. 2021 నవంబర్‌లో మరో మూడు రోజుల్లో ఆయన రిటైర్‌ అవ్వాల్సి ఉండగా.. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌1946 తోపాటు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ యాక్ట్‌ 2003కి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లు తీసుకురాగా.. అప్పటి రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో కేంద్రానికి మరింత బలాన్ని దక్కినట్లయ్యింది.

► 1997కి ముందు ఈడీ, సీబీఐల డైరెక్టర్‌ పదవీకాలం నిర్ధిష్టంగా ఉండేది కాదు. కేంద్రం ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడు తొలగించేది. 

► ఆ తర్వాత పదవీ కాలం రెండేళ్లు చేశారు.

► అయితే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆర్డినెన్స్‌ 2021 ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితికి పెంచింది. అది ముగిశాక వాళ్ల పని తీరు ఆధారంగా మరో ఏడాది పొడిగించుకోవచ్చు. 

► అలా కిందటి ఏడాది నవంబర్‌లో మిశ్రాను ఈడీ డైరెక్టర్‌గా మరో ఏడాది పొడిగించిది కేంద్రం. దీంతో మిశ్రా 2023 నవంబర్‌లో రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ.. 

► సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు చేసిన సవరణపై తీవ్ర స్థాయిలో రాజకీయపరంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విడివిడిగా ఎనిమిది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీళ్లలో కాంగ్రెస్‌, టీఎంసీ, తరపున కూడా కొందరు నేతలు ఉన్నారు. అయితే.. రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్లు కోర్టును ఆశ్రయించారని కేంద్రం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆయా పార్టీలకు చెందిన నేతలు మనీలాండరింగ్‌ ద్వారా ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్నారని.. అందుకే కోర్టుకు చేరారని తెలిపింది.

► ఇక ఇదే ఏడాది ఫిబ్రవరిలో అమికస్‌ క్యూరి(కోర్టు స్నేహితుడు) కేవీ విశ్వనాథన్‌.. జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనానికి ఎస్‌కే మిశ్రా బాధ్యతల పొడిగింపు చెల్లదని నివేదించారు. 

► ఇక పిటిషన్లపై అన్ని వర్గాల వాదనలు విన్న జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. మే 8వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేసి ఉంచింది. 

► దఫదఫాలుగా ఎస్‌కే మిశ్రాను ఈడీ చీఫ్‌గా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన పొడిగింపు చెల్లదని ఇవాళ్టి ఆదేశాల్లో స్పష్టం చేసింది.  అయితే.. కేంద్రం విజ్ఞప్తి చేయడంతో జులై 31వ తేదీ వరకు కొనసాగవచ్చని మాత్రం పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top