రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఓటింగ్‌ ఎలాగ జరుగుతుందో తెలుసా?

EC Issued Gazette Notification For 16th India President - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం.. భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం గెజిట్‌ను విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 

భారత దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ద్వారా భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 29 వరకు రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. జులై 18న ఎన్నికలు జరుగుతాయి. జులై 21న కౌంటింగ్ జరుగుతుంది. 

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. 

ఎలా ఎన్నుకుంటారంటే.. 
సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,809 మంది సభ్యులు ఓటు వేయబోతున్నారు. వీరిలో 776 మంది పార్లమెంటు సభ్యులు కాగా... 4,033 మంది రాష్ట్రాల చట్ట సభలకు చెందినవారు. వీరందరి ఓట్ల విలువ 10,86,431. 

అభ్యర్థి పేరేది?
ఈసారి ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇంతవరకు అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో, సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంకోవైపు, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ.. వివిధ పార్టీల మద్దతును కూడగట్టే బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించింది. విపక్షాల తరపున ఆ బాధ్యతను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top