2022 మార్చికి చలామణిలో రూ.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ: కేంద్రం

E-rupee worth over Rs 130 crore in circulation - Sakshi

న్యూఢిల్లీ: గత సంవత్సరం మార్చి నెలనాటికి దేశంలో రూ.31.33 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని కేంద్రం ప్రకటించింది. 2014 ఏడాదిలో చలామణిలో రూ.13 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా గత మార్చికి ఇంతటి భారీ స్థాయికి పెరిగిందని సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 ఏడాది మార్చిలో డీజీపీలో 11.6 శాతంగా ఉన్న బ్యాంక్‌ నోట్లు, నాణేల వాటా 2022 మార్చి 25వ తేదీకల్లా 13.7 శాతానికి పెరిగింది.

2016 మార్చి నెలలో రూ.16.63 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా 2017 మార్చినాటికి కరెన్సీ చలామణి రూ.13.35 లక్షల కోట్లకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ చలామణిలో ఉన్న కరెన్సీ పెరుగుతూ పోయింది. చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 2018 మార్చికి రూ.18.29 లక్షల కోట్లకు, 2019 మార్చినాటికి రూ.21.36 లక్షల కోట్లకు, 2020 మార్చినాటికి రూ.24.47 లక్షల కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.28.53 లక్షల కోట్లకు, 2022 మార్చి నాటికి రూ.31.33 లక్షల కోట్లకు ఎగబాకింది. నల్ల ధనం చలామణికి చరమగీతం పాడటంతోపాటు డిజిటల్‌ ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులువేసిందని మంత్రి ఉద్ఘాటించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top