
Train Passing Through Goa Waterfall In Heavy Rain: గోవా- బెంగళూరు రైలు మార్గంలో ప్రకృతి రమణీయ దృశ్యం చోటుచేసుకుంది. భారీ వర్షాల దాటికి దూద్‌సాగర్ జలపాతం వెల్లువలా దూకుతున్న వీడియో కనువిందు చేసింది. అయితే, ఈ ఘటన కారణంగా రైలును మధ్యలోనే నిలిపివేయాల్సి రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు... పశ్చిమ కనుమలలోని మొల్లెం జాతీయ పార్కు, భగవాన్ మహవీర్ సాంక్చురీ మధ్య గల ప్రదేశాలు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు.
ఇక్కడే దూద్‌సాగర్ జలపాతం ఉంది. కర్ణాటకలోని బెలగావి జిల్లా నుంచి మొదలయ్యే మాండవీ నది పశ్చిమ కనుమల నుంచి గోవా రాజధాని పనాజీ, ఆపై అరేబియా సముద్రంలో కలిసేందుకు ప్రయాణం చేసే క్రమంలో ఈ వాటర్‌ఫాల్స్ రూపుదిద్దుకుంది. భారత్‌లోని పొడవైన(సుమారు 310 మీటర్లు) జలపాతంగా ఇది పేరొందింది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం పెరగడంతో ఉవ్వెత్తున దూకుతుండటంతో గోవా- బెంగళూరు రైలు ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది.
దీంతో కాసేపు రైలును అక్కడే నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీబీఎన్‌ఎస్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘అత్యంత ప్రమాదకరం.. కానీ ఎంతో అందంగా ఉంది. నిజంగా స్వర్గమే భూమి మీదకు దిగినట్లు ఉంది. పాల సముద్రాన్ని చూస్తున్నట్లు ఉంది. కానీ పాపం ఆ రైలులో ఉన్న వారి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కదా’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరో మూడు రోజుల పాటు కొంకణ్ తీరంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.