Draupadi Murmu Salary: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?

Droupadi Murmu As 15th President: Salary Perks, Retirement Benefits - Sakshi

న్యూఢిల్లీ: భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సంతాల్‌ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో కొత్త చరిత్ర లిఖించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. ప్రతిభా పాటిల్‌ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము.

అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ క్రమంలో రాష్ట్రపతికి జీతం ఎంత ఉంటుంది, ఆమెకు లభించే ఇతర అలవెన్స్‌లు, విరమణ తర్వత పెన్షన్‌ వంటి విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దాం.
చదవండి: కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే

25న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముర్ము రాష్ట్రపతి భవన్‌లోకి మారనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవి కాలం 24తో ముగియడంతో ఆయన ఢిల్లీలోని 12 జనపథ్‌ రోడ్డులో గల  బంగ్లాలోకి వెళ్లనున్నారు.

► భారత రాష్ట్రపతి నెల జీతం రూ. 5 లక్షలు. దీనిని 2018లో రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు.

►దేశంలో అత్యధిక జీతం రాష్ట్రపతికే ఉంటుంది. జీతంతోపాటు ఇతర  అలవెన్సులు కూడా ఉంటాయి.

►రాష్ట్రపతికి గృహ, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఉచితం. అలాగే కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తుంది.

►భారత రాష్ట్రపతితోపాటు వారి జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి

►ప్రెసిడెంట్‌ అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్‌గా పిలుస్తారు. ఇందులో  340 గదులు ఉంటాయి. ఇది  2 లక్చషల దరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది.

►రాష్ట్రపతికి మరో రెండు విడిది నివాసాలు ఉన్నాయి. అక్కడికి సెలవుల నిమిత్తం వెళ్లవచ్చు. ఒకటి సిమ్లాలోని మషోబ్రాలో(వేసవి విడిది) ఉంది, మరొకటి హైదరాబాద్‌లోని బొల్లారంలో(శీతాకాల విడిది) ఉంది.

►రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. కస్టమ్-బిల్ట్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ ఎస్‌600 (డబ్ల్యూ221)లో ప్రయాణిస్తారు. కార్లలో అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. బుల్లెట్‌, బాంబులు, గ్యాస్‌ దాడులు, ఇతర పేలుడు పదార్థాలను తట్టుకోగలవు.

►భారత ఆర్మీ విభాగంలోని అత్యున్నత విభాగం ప్రెసిడెంట్‌ బాడీగార్డ్‌ రాష్ట్రపతికి రక్షణ కల్పిస్తారు. ఈ విభాగంలో త్రివిధ (ఆర్మీ, వాయు, నావీ) దళాలకు చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు.

►భద్రతా కారణాల దృష్ట్యా భారత రాష్ట్రపతి కార్ల వివరాలు ఎప్పుడూ వెల్లడించరు. ఈ కార్లకు లైసెన్స్ ప్లేట్ ఉండదు. దీనికి బదులు జాతీయ చిహ్నం ఉంటుంది

►రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత నెలల రూ. 1.5 లక్షల పెన్షన్ వస్తుంది. అంతేగాక వారి జీవిత భాగస్వామికి నెలకు రూ. 30,000 సెక్రటేరియల్ సహాయం అందుతుంది.

►పెన్షన్‌ కాకుండా ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుంది. అయిదుగురు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. వారి ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 60,000 లభిస్తుంది. జీవిత భాగస్వామితో సహా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top