
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలయ్యింది. దీపాల పండుగను దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తుంటారు. దీపావళి వేళ ఏ రాష్ట్రంలో ఎన్నిరోజులు సెలవులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో..
దేశ రాజధాని ఢిల్లీలోని దీపావళి వేడుకలను అక్టోబర్ 20న జరుపుకుంటున్నారు. గోవర్ధన్ పూజకు అక్టోబర్ 22న జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా దీపావళి సందర్భంగా నోయిడాలోని పాఠశాలలను అక్టోబర్ 20 నుండి 23 వరకు మూసివేయనున్నారు. గురుగ్రామ్‌లో అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 23 వరకూ సెలవులు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలకు అక్టోబర్ 20 నుండి 23 వరకు దీపావళి సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 24న పాఠశాలలను తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో యూపీలోని విద్యార్థులు ఐదు రోజుల సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ సారి చిన్నారులకు దీపాల పండుగను జరుపుకునేందుకు తగినంత సమయం దొరికింది.
హర్యానా
హర్యానాలోని పాఠశాలలకు అక్టోబర్ 19 నుండి 23 వరకు దీపావళి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రాజస్థాన్
రాజస్థాన్‌లోని పాఠశాలలకు దీపావళి సందర్భంగా అక్టోబర్ 13 నుండి 24 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తం 12 రోజుల పాటు దీపావళి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.
బీహార్
దీపావళి,ఛట్ పూజల సందర్భంగా బీహార్‌లోని పాఠశాలలు అక్టోబర్ 18 నుండి 29 వరకు మూసివేయనున్నారు. ఈ సెలవులను ఇంకా పొడిగించనున్నారని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని పాఠశాలలను అక్టోబర్ 24 వరకు మూసివేయనున్నారు. స్థానిక విద్యార్థులు ఇటీవలే దుర్గా పూజ సెలవులను ఎంజాయ్ చేశారు.
కర్ణాటక
రాష్ట్ర సామాజిక, విద్యా సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనేందుకు వీలుగా కర్ణాటకలోని పాఠశాలలు అక్టోబర్ 18 వరకు మూసివేశారు ఇప్పుడు అదనంగా అక్టోబర్ 20 (నరక చతుర్దశి), అక్టోబర్ 22 (బలిపాడ్యమి/ దీపావళి) తేదీలలో పాఠశాలలు మూసివేయనున్నారు.
జమ్ముకశ్మీర్
జమ్ముకశ్మీర్‌లోని అధికారులు వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. జమ్ము డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి పాఠశాల కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా పాఠశాలకు సెలవులు ప్రకటించనున్నారు.
ఒడిశా
దీపావళి, కాళి పూజ వేడుకల కోసం ఒడిశాలోని పాఠశాలలను అక్టోబర్ 20న మూసివేయనున్నారు.
అసోం
దీపావళి, కాళి పూజ వేడుకల కోసం అక్టోబర్ 20న అసోంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలలో..
రాబోయే దీపావళికి.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఒకేరోజు(అక్టోబర్ 20 సోమవారం) అధికారిక సెలవు ప్రకటించారు. అయితే దానికి ముందు రోజు ఆదివారం రావడంతో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి.