
ముందస్తు షెడ్యూల్‌లేకుండానే రాష్ట్రపతితో ధన్‌ఖడ్ భేటీ
విషయం ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారిన జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఉదంతంలో కొత్త విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన రాజీనామా లేఖను అధికారుల ద్వారా పంపకుండా తానే స్వయంగా వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ధన్‌ఖడ్ అందజేశారు.
సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ధన్‌ఖడ్ రాజీనామా అంశాన్ని బహిరంగంగా ప్రకటించారు. అయితే వాస్తవానికి అరగంట ముందే ఆయన ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే నేరుగా రాష్ట్రపతిభవన్‌కు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వెళ్లారు. రాష్ట్రపతి ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయి తన రాజీనామా లేఖను అందజేశారు. తర్వాత వెనుతిరిగారు. ఆ తర్వాతే ‘ఎక్స్’లో రాజీనామా అంశాన్ని బయటపెట్టారు.
‘ఉపరాష్ట్రపతి ఎన్నిక’కు రంగం సిద్ధం
ధన్‌ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఎన్నిక షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే, షెడ్యూల్‌కు ముందుగా పలు ముఖ్యమైన ప్రాథమిక కార్యకలాపాలు చేపట్టాల్సి ఉందని, ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఈసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభలలోని ఎన్నుకోబడిన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఓటర్ల జాబితా(ఎలక్టోరల్ కాలేజీ)ను సిద్ధం చేయనున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారుల నియామకం చేపట్టనున్నారు. ఎన్నికైన సభ్యులతోపాటు నామినేటెడ్ సభ్యులకూ ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హత ఉంటుంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల వివరాలపై విశ్లేషణాత్మక నేపథ్య సమాచారం సేకరించి అన్ని పక్షాలకు అందుబాటులో ఉంచడంపై ఈసీ దృష్టి సారించనుంది. ఈ ఏర్పాట్లు పూర్తయ్యాక ఉపరాష్ట్రపతి ఎన్నికల తుది షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి.పవన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామాచేయడం తెల్సిందే. అయితే కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి మిగిలిన ఆ రెండేళ్ల కాలానికికాకుండా పూర్తిగా వచ్చే ఐదేళ్లపాటు ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత ఉంది.
543 స్థానాలున్న లోక్‌సభలో పశ్చిమబెంగాల్‌లోని బసీర్‌ఘాట్, 245 స్థానాలున్న రాజ్యసభలో పంజాబ్ నుంచి ఒక సీటు, జమ్మూకశ్మీర్ నుంచి నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుత సభ్యుల సంఖ్య 786కాగా అభ్యర్థి గెలవాలంటే కనీసం 394 ఓట్లు సాధించాలి. లోక్‌సభలో 542 మంది సభ్యులకుగాను ఎన్‌డీఏ కూటమికి 293 మంది సభ్యుల మద్దతుంది. రాజ్యసభలో 129 మంది ఎన్‌డీఏకు మద్దతిస్తున్నారు. మొత్తంగా చూస్తే అధికార కూటమికి 422 మంది సభ్యుల మద్దతుంది. దీంతో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి గెలుపు సునాయాసం కానుంది.
ఆమోదం పొందకముందే అన్ని సర్దేసుకుంటూ..
న్యూఢిల్లీ: రాజీనామా చేయాలని శరవేగంగా నిర్ణయం తీసుకున్న జగదీప్ ధన్‌ఖడ్ అంతేవేగంగా తన అధికారిక నివాసం నుంచి ఖాళీచేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా లేఖ ఇచ్చేసి అధికారిక నివాసానికి రాగానే తనకు సంబంధించిన వస్తువులు, సామగ్రి ప్యాకింగ్‌ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సెంట్రల్ విస్టా పునర్‌అభివృద్ది ప్రాజెక్ట్‌లో భాగంగా ఉపరాష్ట్రపతి అధికారిక నివాసం కోసం మోదీ సర్కార్ అత్యంత అధునాతన, సౌకర్యవంతమైన ఇంటిని నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఉపరాష్ట్రపతిగా రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని చర్చ్ రోడ్ ఉపరాష్ట్రపతి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. అందుకే ఆ పనిని ఆయన ఇప్పటికే మొదలుపెట్టారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ ఇంట్లోకి ఆయన మారారు.