
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి తాత్కాలిక స్వేచ్ఛ లభించింది. కోర్టు 40 రోజుల పెరోల్‌మంజూరు చేయడంతో మంగళవారం హరియాణా రాష్ట్రం రొహతక్‌లోని జైలు నుంచి బాబా బయటకు వచ్చారని లాయర్ జితేందర్ ఖురానా తెలిపారు. సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలోనే ఆయన వచ్చే 40 రోజులు గడపాల్సి ఉంటుందన్నారు.
డేరా వద్దకు ఎవరూ రావద్దంటూ అనుచరులనుద్దేశించి విడుదల చేసిన వీడియోలో బాబా కోరారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో కోర్టు డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లోనూ ఆయన ఫర్లో, పెరోల్‌పై బయటకు వచ్చారు. తాజా పెరోల్‌తో కలిపితే ఈ ఏడాది దాదాపు మూడు నెలలపాటు జైలు బయట గడిపినట్లవుతుంది. 2024, 2022 సంవత్సరాల్లోనూ ఆయనకు కోర్టు ఫర్లా వెసులుబాటు కలి్పంచింది. 2017లో జైలుకు వెళ్లిన తర్వాత కనీసం 13 సార్లు ఆయన బయటకు వచ్చారు. డేరా సచ్ఛా సౌదాకు హరియాణా, పంజాబ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో అనుచరులున్నారు.