breaking news
Dera Sacha Sauda Gurmeet Ram Rahim Singh
-
డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి తాత్కాలిక స్వేచ్ఛ లభించింది. కోర్టు 40 రోజుల పెరోల్మంజూరు చేయడంతో మంగళవారం హరియాణా రాష్ట్రం రొహతక్‌లోని జైలు నుంచి బాబా బయటకు వచ్చారని లాయర్ జితేందర్ ఖురానా తెలిపారు. సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలోనే ఆయన వచ్చే 40 రోజులు గడపాల్సి ఉంటుందన్నారు. డేరా వద్దకు ఎవరూ రావద్దంటూ అనుచరులనుద్దేశించి విడుదల చేసిన వీడియోలో బాబా కోరారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో కోర్టు డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లోనూ ఆయన ఫర్లో, పెరోల్‌పై బయటకు వచ్చారు. తాజా పెరోల్తో కలిపితే ఈ ఏడాది దాదాపు మూడు నెలలపాటు జైలు బయట గడిపినట్లవుతుంది. 2024, 2022 సంవత్సరాల్లోనూ ఆయనకు కోర్టు ఫర్లా వెసులుబాటు కలి్పంచింది. 2017లో జైలుకు వెళ్లిన తర్వాత కనీసం 13 సార్లు ఆయన బయటకు వచ్చారు. డేరా సచ్ఛా సౌదాకు హరియాణా, పంజాబ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో అనుచరులున్నారు. -
‘ఎంఎస్‌జీ’ సినిమాపై ఆందోళన
న్యూఢిల్లీ: దేరా సచ్ఛా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్ ’ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీలో శుక్రవారం శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు వారు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ రాజీనామా చేశారని, అయితే ఈ వివాదాస్పద సినిమాకు ఫిల్మ్ సర్టిఫికేషన్ అపెల్లెట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) ఎలా క్లియరెన్స్ ఇచ్చిందని వారు ప్రశ్నించారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ సినిమాపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు పంజాబ్, హర్యానా నుంచి వందలాదిమంది తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఒక సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కాగా, గురువారం రాత్రి సెన్సార్ బోర్డ్ చైర్పర్సన్ లాలా శ్యాంసన్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాకు ఎఫ్‌సీఏటీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. తాను రాజీనామా చేసిన విషయం వాస్తవమేనని, విషయాన్ని ఐ అండ్ బీ సెక్రటరీకి తెలియపరిచానని చెప్పారు. సినిమాల సెన్సార్ సమయంలో బయటవారి జోక్యం, ప్యానల్ సభ్యుల్లో అవినీతి, సెన్సార్ బోర్డ్ అధికారులపై ఆరోపణలు తదితర కారణాలతో తాను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇదిలా ఉండగా, ఎంఎస్‌జీ సినిమా శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది.