మాతోశ్రీని పేల్చేస్తాం | Sakshi
Sakshi News home page

మాతోశ్రీని పేల్చేస్తాం

Published Mon, Sep 7 2020 3:25 AM

Dawood ibrahim man calls up Maharashtra CM Uddhav Thackeray house - Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్‌ కలకలం రేపాయి. మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడినని చెప్పుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌ కాల్స్‌తో మహారాష్ట్ర పోలీసులు సీఎం ఉద్ధవ్‌ నివాసానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ‘బాంద్రా కాలానగర్‌లో ఉన్న సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు రెండు సార్లు ఫోన్‌ చేశాడు. తనెవరో చెప్పలేదు.

దుబాయ్‌ నుంచి దావూద్‌ ఇబ్రహీం తరఫున ఫోన్‌ చేస్తున్నట్లు మాత్రమే చెప్పుకున్నాడు. దావూద్‌ సీఎం ఉద్ధవ్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని అన్నాడు. అయితే, సీఎం నివాసంలోని టెలిఫోన్‌ ఆపరేటర్‌ ఈ కాల్స్‌ను ముఖ్యమంత్రికి ఫార్వార్డ్‌ చేయలేదు’అని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ ఫోన్‌ కాల్స్‌ దుబాయ్‌ నుంచేనా మరేదైనా ప్రాంతం నుంచి వచ్చాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల విషయమై చర్చించేందుకు ఆదివారం భేటీ అయిన రాష్ట్ర కేబినెట్‌..బెదిరింపు కాల్స్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఘటనపై నేర విభాగం దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తామంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్‌ రాలేదని రవాణా శాఖ మంత్రి అనిల్‌ పరబ్‌ అన్నారు.

Advertisement
Advertisement